టీడీపీ అధిష్టానంపై ఎంపీ కేశినేని నాని అలక బూనారు. ఇటీవల పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మెహన్ నాయుడును నియమించిన పార్టీ అధినేత చంద్రబాబు.. పార్టీ విప్‌గా కేశినేని నానిని ఎంపిక చేశారు. అయితే ఈ పదవిపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ తెలిపారు. కానీ ఈ పదవిని తాను స్వీకరించలేనని.. తాను అంత సమర్ధుడిని కాదంటూ కేశినేని నాని పరోక్షంగా అధినేత నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో సమర్థవంతమైన నేతలకు ఈ పదవులు ఇవ్వండి అంటూ ఆయన సలహా ఇచ్చారు. ఇక తాను బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమన్న ఆయన.. తనకు ఆ అవసరం లేదంటూ పేర్కొన్నారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యం కల్పించడం లేదంటూ గత కొన్నిరోజులుగా అసంతృప్తితో ఉన్న కేశినేని.. ఇటీవల ఆయన నియోజకవర్గంలో చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.