Jagadish Reddy – Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిది ప్రజా ఆశీర్వాద యాత్ర కాదు.. ప్రజలను మోసం చేసే యాత్ర అన్నారు తెలంగాణ మంత్రి జి. జగదీష్ రెడ్డి. దేశంలో ఏ రాజకీయ పార్టీలైనా ర్యాలీలు చేసుకోవచ్చని చెప్పిన మంత్రి.. కిషన్ రెడ్డి వాస్తవాలు చెప్పకుండా గాలి మాటలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. 70 రూపాయలు ఉన్న పెట్రోల్ – డీజిల్‌ను వంద దాటించినందుకు ఆశీర్వదించాలని ప్రజలను అడగాలంటూ కిషన్ రెడ్డికి సూచించారు మంత్రి జగదీశ్ రెడ్డి. కిషన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చలేదని మంత్రి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
“బీజేపీ వాళ్లు దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పే స్కిల్ నేర్పిర్రు తప్ప, అభివృద్ధి స్కిల్ నేర్పలేదు. నల్ల డబ్బు తెస్తా అన్న బీజేపీ మాటలు విన్న ప్రజలు తెల్లడబ్బులు కూడా పోగొట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 2వేల రూపాయల పెన్షన్స్ ఎక్కడైనా ఇస్తున్నారా? కనీసం మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనైనా ఇస్తున్నారా? టీఆరెస్ పథకాలు కాపీ కొట్టడమే కాకుండా దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో పూర్తిగా అమలు చేయడం లేదు. మేము పైనుంచి తీసుకొచ్చి పెట్టలేదు – మేమంతా ప్రజలు ఎన్నుకున్నవాళ్ళమే. బీజేపీ రాష్ట్రాలకు ఇస్తున్న డబ్బులు పాకిస్తాన్ నుంచి తెచ్చి ఇస్తున్నారా? మా వాటా కూడా పూర్తిగా ఇవ్వడం లేదు కదా? కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నామో కిషన్ రెడ్డి చెప్పాలి.” అని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాదయాత్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై మంత్రి జి. జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, బొల్లం మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా నేతలు కేంద్రంలోని మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. “బీజేపీ నాయకులు పార్లమెంట్లో ఒకలాగా – బయట మీడియా ముందు ఒకలాగా మాట్లాడుతున్నారు. ఎన్నికల హామీల పై బీజేపీ నాయకులు చర్చకు సిద్ధమా? రాబోయే రోజుల్లో బీజేపీకి దేశం ప్రజలు షాక్ ఇస్తారు సిద్ధంగా ఉండండి. ఒక్కొక్క చట్టం తీసుకొచ్చి దేశ ప్రజలపై బీజేపీ చేసే దాడులు చాలవా? కొత్తగా మళ్ళీ వేరే దాడులు జరగాలా?” అంటూ టీఆర్ఎస్ నేతలు విలేకరుల సమావేశంలో మండిపడ్డారు.