రెజ్లింగ్ స్టార్ బబితా పోగాట్‌పై కాంగ్రెస్ పార్టీ రుసరుసలాడుతోంది.. మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీపై ఇటీవల ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందన్నది కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయం.. అందుకే బబితా పోగాట్‌కు వ్యతిరేకంగా షోలాపూర్‌లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఆందోళనే చేపట్టారు.. బబిత దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. బబిత పోస్టర్‌ను చెప్పులతో కొట్టారు. షోలాపూర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత రాజీవ్‌గాంధీ క్రీడాకారుల కోసం, యువత కోసం చేసిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయ లబ్దికోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
రాజీవ్‌గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బబితా పొగాట్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంతకీ బబితా పోగాట్ ఏమన్నారంటే… భారత క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారాన్ని రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నగా ఇవ్వడమేమిటని అడిగారు? ఆయనేమన్నా క్రీడాకారుడా అని ప్రశ్నంచారు. ఖేల్‌రత్న అవార్డును రాజీవ్‌గాంధీ పేరిట కాకుండా ఏ క్రీడాకారుడో, క్రీడాకారిణో పేరిట ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒలింపిక్స్‌లో, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన ఎంతో మంది స్పోర్ట్స్‌పర్సన్స్ మనకు ఉన్నారని బబితా పోగాట్ అన్నారు. ఖేల్‌రత్న అవార్డు ధ్యాన్‌చంద్ పేరిట ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని ఇంతకు ముందు చాలా మంది వ్యక్తం చేశారు..