BJP – Congress Donations: బీజేపీకి విరాళాల వెల్లువ… కాంగ్రెస్ పార్టీ కంటే ఐదింతలు ఎక్కువ

|

Jun 10, 2021 | 2:14 PM

దేశంలో అధికార పార్టీలకు విరాళాలు వెల్లువెత్తుతుండగా...ప్రతిపక్షాలకు మాత్రం విరాళాలిచ్చే నాధుడే కరువయ్యాడు.  కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి దేశంలోనే అత్యధిక విరాళాలు అందాయి. ఆ పార్టీ దేశంలో అత్యధిక విరాళాలు పొందడం ఇది వరుసగా ఏడో సంవత్సరం. 

BJP - Congress Donations: బీజేపీకి విరాళాల వెల్లువ... కాంగ్రెస్ పార్టీ కంటే ఐదింతలు ఎక్కువ
BJP vs Congress
Follow us on

దేశంలో అధికార పార్టీలకు విరాళాలు వెల్లువెత్తుతుండగా…ప్రతిపక్షాలకు మాత్రం విరాళాలిచ్చే నాధుడే కరువయ్యాడు.  కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి దేశంలోనే అత్యధిక విరాళాలు అందాయి. ఆ పార్టీ దేశంలో అత్యధిక విరాళాలు పొందడం ఇది వరుసగా ఏడో సంవత్సరం.  ఇది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాల కంటే ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ మేరకు పలువురు వ్యక్తులు, వివిధ కంపెనీలు, ఎలక్ట్రోరల్ ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలు అందాయి. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో తమకు అందిన విరాళాల నివేదికలను ఆయా రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశాయి.

బిజెపికి వివిధ కంపెనీలు, వ్యక్తుల నుంచి రూ.785.77 కోట్ల మేర విరాళాలు అందాయి. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన నివేదికలో కమలం పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్‌కు అందిన విరాళాలు(రూ.139 కోట్లు) కంటే ఐదు రెట్లు ఎక్కువ. బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్‌కు చెందిన  జూపిటర్ క్యాపిటల్, ఐటీసీ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్‌, జిఎంఆర్‌ ఎయిర్‌ పోర్టు డెవలపర్స్‌ ఇతర బడా కార్పోరేట్‌ సంస్థలతో కూడిన ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు నుంచి రూ.217 కోట్లు బీజేపీకి అందాయి. అలాగే జెఎస్‌డబ్ల్యు గ్రూపు సంస్థలకు సంబంధించిన జనకల్యాణ్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు రూ.45.95 కోట్లు బీజేపీకి విరాళంగా ఇచ్చింది. హిందాల్కోకు చెందిన సమాజ్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు రూ.3.75 కోట్లు, ఎబి జనరల్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు రూ.9 కోట్లు బిజెపికి సమర్పించుకున్నాయి. ఐటిసి లిమిటెడ్‌ నుంచి హల్దీరామ్‌ స్నాక్స్‌ వరకు అనేక కంపెనీలు బీజేపీకి బూరి విరళాలిచ్చాయి.

దేశంలోని పలు ప్రముఖ విద్యా సంస్థలు కూడా బీజేపీకి భారీగా విరాళాలు సమర్పించుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సభ్యులు కూడా పార్టీకి విరాళాలు ఇచ్చారు. రూ.20వేల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన వ్యక్తులు, సంస్థల పేర్లను ఎన్నికల సంఘానికి పార్టీలు తెలియజేయాల్సి ఉంటుంది. దాని కంటే తక్కువ విరాళాలను కూడా పరిగణలోకి తీసుకుంటే బీజేపీకి అందిన మొత్తం విరాళాలు ఇంకా చాలా ఎక్కువ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Representative Image

ఇక జాతీయ గుర్తింపు పొందిన మిగిలిన పార్టీల్లో కాంగ్రెస్‌కు రూ.139.01 కోట్లు విరాళం దక్కింది. కాంగ్రెస్‌కు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల ద్వారా రూ.58 కోట్లు విరాళాలు దక్కాయి. వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలతో పోలిస్తే జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు అంతంత మాత్రంగానే విరాళాలు అందాయి.  సిపిఎంకు రూ.19.69 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 8.08 కోట్ల విరాళాలు అందాయి. సిపిఐకి రూ.1.29 కోట్లు, ఎన్‌సిపికి రూ.59.94 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల్లో ఆ పార్టీలు వెల్లడించాయి. అయితే 2020లో తమకు విరాళాలు ఏమీ అందలేదని బీఎస్పీ తెలిపింది.

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు రూ.130.46 కోట్లు, మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యంవహిస్తున్న శివసేనకు రూ.111.4 కోట్లు విరాళాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి రూ.92.7 కోట్లు విరాళాలు దక్కగా, ఒడిశా అధికార పార్టీ బీజేడీకి రూ.90.35 కోట్లు, తమిళనాట గత ఏడాది అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకేకు రూ.89.6 కోట్లు, డీఎంకేకు రూ.64.90 కోట్లు విరాళాలు అందాయి.