AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభైంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు.
పురపోరులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 64 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నట్లు కమిషనర్ తెలిపారు. విజయవాడలో మొత్తం 7.83 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 347 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ప్రసన్న వెంకటేశ్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు గాను దాదాపు 4,800 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు ఓటర్ స్లిప్పుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాల్సిందిగా కమిషనర్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని విజయవాడ నగరపాలక కమిషనర్ ప్రసనన వెంకటేశ్ తెలిపారు.
ఇక రాష్ట్ర మొత్తం మీద 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా.. వైఎస్సార్ జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాంతో ఆ నాలుగు పట్టణాల్లో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండాపోయింది.
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించడంతో సందిగ్ధత తొలగిపోయింది. వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు పోనూ మొత్తం 2,214 వార్డులు/డివిజన్లలో 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 77,73,231 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
Read More:
కార్మిక సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. విశాఖ ఉక్కుపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదన్న సజ్జల