Visakha Lanka Lands: అసైన్డ్‌ భూములు, లంక భూములపై లబ్దిదారులకే హక్కులు.. రాజకీయ రగడకు ఏపీ కేబినెట్ చెక్..

|

Jul 13, 2023 | 8:01 AM

విశాఖ భూముల కుంభకోణంపై సిట్‌ నివేదిక వచ్చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు కూడా చేసింది. ఏపీ కేబినెట్‌ సమావేశంలో ఈ నివేదికకు గ్రీన్‌ సిగ్నల్‌కూడా ఇచ్చారు. రానున్న రోజుల్లో ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ముందుకు కదిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో పొలిటికల్‌ దుమారం కూడా చెలరేగే అవకాశాలు లేకపోలేదు.

Visakha Lanka Lands: అసైన్డ్‌ భూములు, లంక భూములపై లబ్దిదారులకే హక్కులు.. రాజకీయ రగడకు ఏపీ కేబినెట్ చెక్..
Visakha Land Scam
Follow us on

విశాఖ భూముల వ్యవహారంపై గత చంద్రబాబు హయాంలోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అయ్యన్నపాత్రుడైతే స్వయంగా ఫిర్యాదులు కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో అప్పటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ప్రభుత్వాన్ని బాగానే టార్గెట్‌ చేసింది. విశాఖలో జగన్‌ ధర్నా కూడా చేశారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ వేసింది. డీఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్, జాయింట్‌ కలెక్టర్‌ సృజన, డిప్యూటీ కలెక్టర్‌ విజయసారధిలతో ఈ కమిటీ పనిచేసింది ఓ నివేదిక ఇచ్చింది. ఇప్పటి మంత్రి ధర్మాన సహా 8 మంది ఐఏఎస్‌ అధికారులు, జిల్లా అధికారులు, రెవిన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో పలువురి అధికారుల పేర్లను తన నివేదికలో అప్పటి సిట్‌ పేర్కొంది. సిట్‌ ఆరోపణలను ధర్మాన ఎప్పుడో కొట్టిపారేశారు. జిల్లాకలెక్టర్‌ ఎన్‌ఓసీ ఇచ్చాకే భూములు కొనుగోలు చేశానని యజమానుల నుంచి కొనుగోలు చేశానని ఆయన స్పష్టంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం… సిట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని, అసలైన వారిని వదిలేశారని, రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ధర్మాన పేరును తీసుకు వచ్చారని వైసీపీ అప్పట్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది.

జగన్‌ ప్రభుత్వం వచ్చాక.. వైజాగ్‌ ల్యాండ్‌ స్కాం ఆరోపణలపై దృష్టిపెట్టింది. పాత సిట్‌ కాకుండా కొత్తగా సిట్‌ను వేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు విజయ్‌కుమార్‌, వై.వి. అనూరాధ, రిటైర్డ్‌ జడ్జి టి. భాస్కరరావులను నియమించింది. తర్వాత ఈ సంఖ్యను ఆరుగురికి పెంచింది. అక్టోబరు 17, 2019లో ఏర్పాటైన సిట్‌ కమిటీ గడువును కూడా పెంచారు. చివరకు ఈ కొత్త సిట్‌ ఇచ్చిన నివేదికపై చీఫ్‌ సెక్రటరీ, ల్యాడ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన స్పెషల్ సీఎస్‌, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా ముగ్గురు సభ్యుల కమిటీ క్షుణ్నంగా పరిశీలించి కీలక సిఫార్సులు చేసింది. మొత్తంగా 69 సిఫార్సులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మరో 18 అంశాలపై మరింత శోధన అవసరమని కమిటీ చెప్పింది.

సిట్‌ ఏర్పాటు చేసేటప్పుడే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌లో భాగంగా ఏడు రకాల మార్గదర్శకాలు నిర్దేశించింది. ప్రభుత్వ భూముల వర్గీకరణలో మార్పులు చేశారా? మాజీ సైనికులు, స్వచ్ఛంద సంస్థలు, స్వాతంత్ర్య సమరయోధులుకు ఇచ్చిన భూముల రికార్డుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయా? ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన ప్రభుత్వ భూముల వ్యవహారాలు, కబ్జా చేసిన ఘటనలు, సరైన పద్ధతి పాటిచకుండా ఇష్టాను సారం ప్రభుత్వ భూములు ధారాదత్తంచేయడం, రికార్డుల టాంపరింగ్‌, పౌరులనుంచి వచ్చే ఫిర్యాదులు.. వీటన్నింటిపైనా కూడా సిట్‌ వెలికి తీసింది.

ఇక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడమే తరువాయిగా కనిపిస్తోంది. నివేదికలో పేర్కొన్న వ్యక్తులపై ఎలాంటి కేసులు నమోదు చేస్తారు? వారిని ఏరకంగా చట్ట పరిధిలోకి తీసుకు వస్తారు? అన్నదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. చర్యలు మొదలైన తర్వాత… విశాఖలోనే కాదు, రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం