
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని 1200 కోట్లతో గత ప్రభుత్వం పునర్నిర్మించింది. ఆలయ నిర్మాణంతో పాటు టెంపుల్ సిటీ అభివృద్ధి, కాటేజీల నిర్మాణం, రహదారులు, సరస్సులు, ఉద్యానవనాలు, అభయారణ్యాలు, నిత్యాన్నదాన సత్రాలు, కల్యాణ మండపాలు, వేద పాఠశాల, శిల్ప నిర్మాణ సంస్థ వంటివి ఏర్పాటయ్యాయి. ఐదేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని కృష్ణ శిలలతో సర్వాంగ సుందరంగా నిర్మించారు.యాదాద్రి కొండపై కొలువుదీరిన ఆ నారసింహుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

యాదాద్రిలో అన్నదాన మహాయజ్ఞం..ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరి గుట్టలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. గంటల తరబడి ప్రయాణించి ఆలయానికి చేరుకుంటారు. దర్శనం అనంతరం భక్తుల ఆకలి తీర్చేందుకు ఆలయ అధికారులు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.స్వామివారి దర్శనంతో మనసును నింపుకునే భక్తుల కోసం, యాదాద్రి దేవస్థానం కొండ కింద అద్భుతమైన రీతిలో నిత్యాన్నదానం (మహా అన్నప్రసాద వితరణ) నిర్వహిస్తోంది. ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు అన్నప్రసాద సత్రానికి చేరుకుని భోజనం చేస్తున్నారు.

దర్శనం ఒక వరం.. అన్నప్రసాదం మరో వరం..ఆలయానికి వచ్చే భక్తులకు దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలతో పాటు అన్నప్రసాదం కూడా ఎంతో కీలకం. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు నిత్యాన్నదానం ఎంతో ఊరటనిస్తోంది. హోటళ్లలో భోజనం కోసం వెతకాల్సిన అవసరం లేకుండా.. స్వామివారి సన్నిధిలోనే ప్రసాద భోజనం చేసే అవకాశం కలుగుతోంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. అన్నదానాన్ని కేవలం భోజనంగా కాకుండా స్వామివారి ప్రసాదంగా భక్తులు భావిస్తారు. సంప్రదాయబద్ధంగా భోజనం వడ్డిస్తూ భక్తులకు ఆతిథ్యం అందిస్తున్నారు. కుటుంబాలతో వచ్చినవారు.. వృద్ధులు.. చిన్నారులు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు ఇలా ఎంతోమందికి అన్నప్రసాదం ఆకలి తీరుస్తోంది.

హిందూ సంప్రదాయంలో అన్నదానానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని పెద్దలు చెబుతారు. ఆకలితో వచ్చినవారికి అన్నం పెట్టడం అన్నింటికంటే గొప్ప సేవగా భావిస్తారు. అదే స్ఫూర్తితో యాదాద్రిలో కొనసాగుతున్న నిత్యాన్నదానం.. భక్తులకు ఆధ్యాత్మిక తృప్తితో పాటు కడుపునిండా భోజనాన్ని అందిస్తోంది. దేవుడి దర్శనం మనసుకు తృప్తినిస్తే.. అన్నప్రసాదం కడుపుకు తృప్తినిస్తోంది. యాదాద్రికి వచ్చిన భక్తులకు నారసింహుడి దర్శనంతో పాటు అన్నప్రసాదం రూపంలో ఆతిథ్యం లభిస్తోంది.

దేవదేవుడి దర్శనార్థం వచ్చే భక్తులకు కడుపునిండా రుచికరమైన, శుచికరమైన ప్రసాద భోజనాన్ని అందించడమే లక్ష్యంగా నారసింహుడి క్షేత్రంలో అన్నదాన సత్రం కొనసాగుతోంది. నిత్యాన్నదానంలో భక్తులకు రుచికరమైన ఆహార పదార్థాలను వడ్డిస్తారు. నిరతాన్నదానంలో భక్తులకు అత్యంత సంప్రదాయబద్ధంగా అరటి ఆకులోశుచిగా వండిన పదార్థాలను వడ్డిస్తారు. ఈ మహా ప్రసాద భోజనంలో ప్రధానంగా వేడివేడిగా నాణ్యమైన బియ్యంతో వండిన శుద్ధమైన అన్నం ఉంటుంది. అన్నంతో పాటు కమ్మని పప్పు, కూరగాయలు, ఆకుకూరలతో కలిపి వండిన సాంప్రదాయ పప్పు.

సుగంధ ద్రవ్యాల సువాసనలతో, నోరూరించేలా తయారుచేసే సాంబారు, భోజనం చివరలో భక్తుల జీర్ణక్రియకు ఎంతో మేలు చేసే చల్లని మజ్జిగ వడ్డిస్తారు. కొన్ని ప్రత్యేక దినాల్లో స్వామివారికి నివేదించిన పాయసం, పులిహోరను కూడా భక్తులకు వడ్డిస్తుంటారు.ఆకలి తీర్చే అన్నదానం.. ఆధ్యాత్మిక సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. అందుకే యాదాద్రిలో భక్తుల నోట వినిపిస్తున్న మాట ఒక్కటే.. దర్శనం దైవానుగ్రహం.. అన్నప్రసాదం ఆ స్వామివారి ఆశీర్వాదం.