
Why Storms Happen in Evening: ప్రకృతి సృష్టించే వింతల్లో తుఫానులు, ఉరుములు ఒకటి. అయితే ఇవి రావడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఎందుకు ఉంటుంది అనేది ఎప్పుడైనా ఆలోచించారా? వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ఒక తుఫాను లేదా ఉరుములతో కూడిన వాతావరణం ఏర్పడటానికి ప్రధానంగా మూడు అంశాలు అవసరం. అవి: వాతావరణంలో అస్థిరత, పైకి లేచే వేడి గాలి, గాలిలో తగినంత తేమ. ఈ మూడు పరిస్థితులు ఉదయం పూట అస్సలు సాధ్యపడవు. రాత్రంతా సూర్యుడు ఉండడు కాబట్టి భూ ఉపరితలం పూర్తిగా చల్లబడి ఉంటుంది. ఉదయం పూట వాతావరణం ప్రశాంతంగా, స్థిరంగా ఉండటానికి కారణం ఇదే.

మధ్యాహ్నం 3 నుంచి సాయంత్ర 6 మధ్య ఏం జరుగుతుంది?: సూర్యోదయం తర్వాత అసలు కథ మొదలవుతుంది. సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన కిరణాలను భూమి నిరంతరం గ్రహిస్తూనే ఉంటుంది. ఇలా గంటల తరబడి భూమి వేడెక్కడం వల్ల వాతావరణంలో మార్పులు మొదలవుతాయి. సాధారణంగా మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల మధ్య భూమి ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ తీవ్రమైన వేడి వాతావరణంలో పెద్ద ఎత్తున అలజడిని సృష్టిస్తుంది. ఈ సమయంలోనే వాతావరణానికి తుఫానులను సృష్టించడానికి కావలసిన భారీ శక్తి లభిస్తుంది.

వేడి గాలి ప్రయాణం.. అల్పపీడన గండం: భూమి విపరీతంగా వేడెక్కినప్పుడు, దాని పైన ఉండే గాలి కూడా వేడెక్కుతుంది. సైన్స్ ప్రకారం, చల్లటి గాలితో పోలిస్తే వేడి గాలి బరువు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ వేడి గాలి అత్యంత వేగంగా పై వాతావరణంలోకి దూసుకుపోతుంది. ఇలా గాలి పైకి లేవడం వల్ల భూమికి సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం (తక్కువ గాలి ఒత్తిడి ఉండే చోటు) ఏర్పడుతుంది. భూమి ఎంత ఎక్కువగా వేడెక్కితే, గాలి అంత వేగంగా పైకి లేస్తుంది, వాతావరణం అంతగా అస్థిరంగా మారుతుంది.

ఈ ఖాళీగా ఉన్న అల్పపీడన ప్రాంతాన్ని భర్తీ చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చల్లని, బరువైన గాలి అత్యంత వేగంగా దూసుకువస్తుంది. ఈ రెండు రకాల గాలుల ఘర్షణ, వేగవంతమైన కదలికల వల్లే మనకు బలమైన ఈదురు గాలులు, భయంకరమైన దుమ్ము తుఫానులు సంభవిస్తాయి.

ఉదయం పూట తుఫానులను అడ్డుకునే 'ఆ కవచం' ఏంటి?: రాత్రి వేళల్లో భూమి తన వేడిని కోల్పోయి చల్లబడుతుంది. ఉదయం పూట నేలకు దగ్గరగా ఉండే గాలి చల్లగా, స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన వాతావరణ ప్రక్రియ జరుగుతుంది, దీన్ని శాస్త్రవేత్తలు 'టెంపరేచర్ ఇన్వర్షన్' (ఉష్ణోగ్రత విలోమనం) అంటారు. ఈ స్థితిలో చల్లటి గాలి భూమికి దగ్గరగా ఉండిపోతుంది, దాని పైన కొద్దిగా వేడి గాలి ఉంటుంది. ఇది వాతావరణానికి ఒక మూతలా పనిచేస్తుంది. దీనివల్ల కింది గాలి పైకి లేవడానికి వీలుండదు. ఫలితంగా ఉదయం పూట తుఫానులు వచ్చే అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది.

ప్రకృతిలో జరిగే ప్రతి మార్పు వెనుక ఒక అద్భుతమైన విజ్ఞానం దాగి ఉంటుంది. భూమి పగటిపూట గ్రహించే వేడి, సాయంత్రానికి వాతావరణంలో అస్థిరతగా మారి తుఫానుల రూపంలో శాంతిస్తుంది. కాబట్టి, ఇకపై మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఆకాశం ఒక్కసారిగా చీకటిపడి, ఉరుములు మొదలైతే.. అది భూమి తనలోని వేడిని బయటకు పంపడానికి ప్రకృతి చేస్తున్న ప్రయత్నమని గుర్తుంచుకోండి!