
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌లో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడి స్మశాన వాటికలో 22 మంది కరోనా మృతులకు ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.

ఇటీవల, బీడ్ జిల్లాలోని అంబజోగైలో ఒకే స్థలంలో 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అహ్మద్ నగర్ నుంచి వచ్చిన వార్త రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుది.

ఇక్కడ అమర్‌ధామ్‌లో 22 కరోనా మృతదేహాలను ఒకేసారి కాల్చాల్సి వచ్చింది. అలాగే ఒక రోజులో ఏకంగా 42 మందికి చితి పెట్టారట. కాగా, కరోనా రోగులకు దహన సంస్కారాలు చేయడంలో అహ్మద్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్ సవాల్ ఎదుర్కుంటోంది.

అహ్మద్‌నగర్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ వేగంగా పెరుగుతోంది. ఇక్కడ కరోనా కారణంగా ఇప్పటివరకు 1270 మంది మరణించారు. జిల్లా యంత్రాంగం ఇచ్చిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 8 గురువారం 15 మంది మరణించారు. కాగా అధికారుల లెక్కలకు, అంత్యక్రియల జరిపిన మృతదేహాలకు గల గణాంకాల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రస్తుతం, అహ్మద్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం 11 వేల 237 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

ఏది ఏమైనా కరోనా దేశవ్యాప్తంగా మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రజలు మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే విపత్తు తప్పదు.