
ముందుగా గ్యాస్ ఆన్ చేసి, ఒక ప్రెషర్ కుక్కర్ లేదా మందపాటి గిన్నెను పొయ్యి మీద పెట్టండి. అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే నెయ్యిలో పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోండి.

ఇదే కుక్కర్‌లో (నెయ్యి తక్కువగా ఉంటే ఇంకొక టీ స్పూన్ నెయ్యి కలుపుకోవచ్చు), పెసరపప్పు వేసి లో ఫ్లేమ్‌లో మూడు నుండి నాలుగు నిమిషాలు సువాసన వచ్చే వరకు వేయించండి. పెసరపప్పు రంగు కొద్దిగా మారిన తర్వాత బాగా వేగిందని అర్థం. వేయించిన పెసరపప్పులోకి 2 1/2 కప్పుల నీళ్లు పోసి, ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టండి.మూడు, నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్స్ వచ్చి, కుక్కర్ లోని గాలి పూర్తిగా పోయిన తర్వాత మూత తీయండి.

ఉడికించిన పెసరపప్పును కొద్దిగా స్మాష్ చేసుకోండి. మరీ ఎక్కువగా మెత్తగా చేయవద్దు. పాయసం తినేటప్పుడు పప్పు మధ్యమధ్యలో పంటికి తగిలితే రుచిగా ఉంటుంది. కాబట్టి ఒక టూ, త్రీ టైమ్స్ మెదుపుకుంటే సరిపోతుంది. పప్పు మొత్తానికి మెత్తగా ఉండకూడదు. మరో ప్యాన్‌ను గ్యాస్‌పై పెట్టి, అందులోకి తురిమిన బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి కరిగించండి. బెల్లం కరిగిన తర్వాత, దానిని ఒక రెండు, మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించండి. పాకం అవసరం లేదు, బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడాలి అంతే.

బెల్లం పాకం తయారైన తర్వాత, అందులోకి ముందుగా ఉడికించిన పెసరపప్పును వేసి బాగా కలపండి. మరోవైపు, పాలను వేడి చేయండి. పాయసంలో ఎప్పుడూ వేడి పాలు మాత్రమే వాడాలి. వేడి చేసిన పాలను కొద్దికొద్దిగా పెసరపప్పు మిశ్రమంలో పోస్తూ, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి.

పప్పు, పాలు, బెల్లం మిశ్రమాన్ని లో ఫ్లేమ్‌లో ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించండి. పాయసం అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాయసం చిక్కబడిన తర్వాత, గంటెతో డ్రాప్ చేసినప్పుడు పప్పు, పాలు వేరువేరుగా కాకుండా కలిసికట్టుగా చిక్కగా రావాలి. ఇదే సరైన పాకం.పాయసం సిద్ధమైన తర్వాత, యాలకుల పొడి వేసి బాగా కలపండి.