
వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం వేద పండితులు, అర్చక స్వాములు స్వామివారికి విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు, నిర్వహిస్తున్నారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ కనుల పండువగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వసంత మండపంలో కొలువుదీరిన ఉత్సవమూర్తులకు వివిధ రకాల పూజలు, మండప ఆరాధనలు, హోమములు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి.

ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు, ధర్మకర్తల మండలి సభ్యులు బ్రహ్మోత్సవాలను దగ్గరుండి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర వాయిద్యాలు, కోలాటాలు, శక్తి వేషాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడపల్లి వెంకన్న దివ్య క్షేత్రాన్ని వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు స్వామి వారి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు వివిధ దేవతామూర్తుల అలంకరణలతో వివిధ వాహన సేవలు నిర్వహిస్తున్నారు.

వాహన సేవలో స్వామి అమ్మవార్లు ప్రతిరోజు ఆయా వాహనాలపై అలంకృతులై తిరుమాన వీధులలో విహరించి భక్తులకు అభయ హస్తం అందిస్తున్నారు. ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

భక్తజనం బ్రహ్మోత్సవం వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందుతున్నారు. ఇప్పటికే ఐదు రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా మరో నాలుగు రోజులు పాటు కొనసాగనున్నాయి.