గత రెండు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రానున్న 2023 ఏడాదిలో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కస్టమర్ డిమాండ్‌ను అనుసరించి టాటా మోటార్స్, మహీంద్రా, MG వంటి ప్రముఖ కార్ కంపెనీలు వివిధ ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం..
BMW i7: త్వరలో విడుదల కాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో బీఎమ్‌డబ్య్లూ ఐ7 కూడా ఉంది. ఒక్క సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 625కిమీల మైలేజ్‌ను ఇచ్చే ఈ కారు 2023 సంవత్సరం ముగింపు దశలో లాంచ్ అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ కార్‌లో వెనుక కూర్చున్న ప్రయాణీకుల కోసం 31.3-అంగుళాల 8K టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల కర్వ్డ్ డిజిటల్ కాక్‌పిట్, 14.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్ ఫ్రంట్ ఇంకా రియర్ సీట్లు వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.
Audi Q8 E-Tron: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆడీ కంపెనీ నుంచి కూడా 2023 లో కొత్త ఎలక్ట్రిక్ మోడల్ కార్ రానుంది. ఆడీ క్యూ8 ఇ-ట్రాన్ ఎస్‌యూవీను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 531 కిమీల మైలేజీని ఇస్తుంది. క్యూ8 ఇ-ట్రాన్ మూడు వేరియంట్లతో మొత్తం నాలుగు మోడళ్లను ఆడీ ఆవిష్కరించింది. కొత్త క్యూ8 ఇ-ట్రాన్, క్యూ8 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్, ఎస్‌క్యూ8 ఇ-ట్రాన్, ఎస్‌క్యూ8 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌లను ఆడీ 2023లో భారత్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రిక్ SUV ఎయిర్-స్ప్రింగ్ సస్పెన్షన్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), రిమోట్ పార్క్ అసిస్ట్ ప్లస్, డిజిటల్ మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్స్, 10.1 అంగుళాల డిస్‌ప్లే, వాయిస్ కంట్రోల్ ఇంకా టచ్ రెస్పాన్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫుల్ HD ఆడీ వర్చువల్ కాక్‌పిట్ వంటివి ఈ కారులో ఫీచర్స్‌గా ఉన్నాయి.
మహీంద్రా X UV400 ఎలక్ట్రిక్: త్వరలో విడుదల కాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో మహీంద్రా XUV 400 EV మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్‌ను ఆవిష్కరించిన మహీంద్రా కంపెనీ 2023 జనవరి మధ్యలో దీని ధరను ప్రకటించనుంది. ఈ కొత్త మోడల్‌లో మహీంద్రా 100 KV ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు 39.4 KVH లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ జతగా ఉంది. ఫలితంగా ఈ కొత్త XUV400 కారు అద్భుతమైన పనితీరుతో ఒక ఛార్జ్‌కి గరిష్టంగా 456 కిమీ మైలేజీని ఇస్తుంది.
టాటా పంచ్ ఎలక్ట్రిక్: 2023లో విడుదల కానున్న ముఖ్యమైన కార్లలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఒకటి. కొత్త పంచ్ EVలో టియాగో EV వంటి రెండు బ్యాటరీలు చాయిస్‌గా. ఇంకా ఇందులో ఎంట్రీ లెవల్ 19.2 KVH మోడల్ , టాప్-ఎండ్ 24 KVH బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఫలితంగా ఈ ఈవీ కారు ఒక్కో ఛార్జ్‌కు 280 నుంచి 350 కి.మీ మైలేజీని ఇవ్వగలదు. ఈ కొత్త కారు టాటా కంపెనీకి భారీ డిమాండ్‌ను తెస్తుందని యాజమాన్యం భావిస్తోంది.
MG మైక్రో ఎలక్ట్రానిక్ కార్: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విక్రయంలో అగ్రగామిగా ఉన్న ఎంజీ మోటార్ కంపెనీ త్వరలో మరిన్ని ఈవీ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ZS EV కారు తర్వాత ఈసారి మైక్రో EV లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది ఆ కంపెనీ. వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందు కోసం ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ అవబోతోంది. అంతే కాకుండా పట్టణ ట్రాఫిక్‌కు అనుకూలంగా ఉండేలా ఈ కొత్త కారు ఒక్కో ఛార్జీకి 150 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండవచ్చు.
సిట్రాన్ E C3: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఎలక్ట్రిక్ కార్ మోడల్స్‌లో Citroen E C3 కూడా ఒకటి. బడ్జెట్ ఈవీ కార్ల జాబితాలో సంచలనం సృష్టించిన ఈ కొత్త ఈసీ3 కారు మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానుంది. కొత్త E C3 కారు మోడల్ సాధారణ C3 కార్ మోడల్‌లాగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ కారు ఒక్కో ఛార్జీకి 300 కిమీ మైలేజీని అందిస్తుంది. సిట్రాన్ E C3 కార్ మోడల్‌ను దాని కంపెనీ సిట్రాన్ పూర్తిగా భారతదేశంలోనే తయారు చేస్తోంది. అలాగే భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి ఎగుమతి చేయాలని సిట్రాన్ కంపెనీ యోచిస్తోంది.