
ఇళ్లలో పెంచుకునే తులసి చెట్టు నిండుగా, గుబురుగా పెరగడానికి కొన్ని సాధారణ మెలకువలు పాటించడం చాలా అవసరం. అలాగే మొక్క ఎదుగుదల కోసం 12 నుండి 15 అంగుళాల సైజు గల కుండీని ఉపయోగించాలి. విపరీతమైన ఎండ లేదా అతి చలి నుంచి తులసి మొక్కను రక్షించడం ద్వారా అది ఎప్పటికీ తాజాగా, ఆరోగ్యంగా కళకళలాడుతుంది. మరిన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం..

క్రమం తప్పకుండా ప్రూనింగ్ : తులసి మొక్కను గుబురుగా మార్చడానికి దాని కత్తిరింపు చాలా ముఖ్యం. మొక్కపై చిన్న చిన్న పూలు లేదా మంజరు రాగానే వాటిని వెంటనే కట్ చేయాలి. మంజరు రావడం వల్ల మొక్క పెరుగుదల ఆగిపోతుంది. వాటిని కట్ చేయడం ద్వారా కొత్త కొమ్మలు మరియు చిగుర్లు వేగంగా వస్తాయి.

సరైన సైజు గల కుండీ ఎంపిక: మొక్క వేర్లు బాగా విస్తరించడానికి తగినంత స్థలం ఉండాలి. గార్డెనింగ్ నిపుణుల ప్రకారం తులసిని కనీసం 12 నుండి 15 అంగుళాల పరిమాణం గల కుండీలో నాటాలి. అలాగే కుండీకి అడుగున నీరు బయటకు పోయేలా రంధ్రం ఉండాలి. లేదంటే నీరు నిలిచి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.

తగిన ఎరువుల వాడకం: మొక్క ఎదుగుదల మందగించినప్పుడు లేదా పొడవుగా పెరిగి గుబురుగా లేనప్పుడు పోషకాలు అందించాలి. ఇందుకోసం వర్మీకంపోస్ట్ లేదా బాగా పండిన ఆవు పేడ ఎరువును ఉపయోగించవచ్చు. మట్టిని కొద్దిగా పైకి జరిపి 2-3 గుప్పెళ్ల ఎరువును వేసి కలపాలి. తద్వారా మొక్కకు కావాల్సిన పోషకాలు అంది కళకళలాడుతుంది.

ఎండ, చలి నుంచి రక్షణ: అతిగా కాసే ఎండ మరియు విపరీతమైన చలి నుంచి తులసిని కాపాడుకోవాలి. మధ్యాహ్నం వేళల్లో వచ్చే తీవ్రమైన ఎండ తగలకుండా నీడ ఉండే చోట ఉంచాలి. అలాగే శీతాకాలంలో రాత్రి వేళల్లో మంచు లేదా చలి నుంచి రక్షించడానికి పల్చని గుడ్డతో కప్పడం మంచిది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా మీ ఇంట్లోని తులసి మొక్క ఎప్పటికీ పచ్చగా, గుబురుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది.