
కావలసిన పదార్థాలు: పావు కప్పు కందిపప్పు, 1 టీస్పూన్ మినప్పప్పు, 15 నుండి 20 ఎండు మిరపకాయలు, పావు కప్పు కరివేపాకు, 1 టీస్పూన్ జీలకర్ర, వేడి నీళ్లలో నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 3 నుండి 4 పొట్టు తీసినవి వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, పచ్చడి కలపడానికి సరిపడా కాచి చల్లార్చిన నీళ్లు, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనె , 1 టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ ఇంగువ, పావు టీస్పూన్ పసుపు

తయారీ విధానం: ముందుగా ఒక చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండును కొద్దిగా వేడి నీళ్లలో నానబెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి పావు కప్పు కందిపప్పు వేసి సన్నటి సెగపై దోరగా వేయించాలి. కందిపప్పు కాస్త వేగిన తర్వాత ఒక టీస్పూన్ మినప్పప్పు వేసి వేయించాలి. దినుసులు మాడిపోకుండా చూసుకుంటూ.. అందులోనే 15 నుండి 20 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగాక పావు కప్పు కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి. చివరగా దించే ముందు ఒక టీస్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి, దినుసులను పూర్తిగా చల్లారనివ్వాలి.

చల్లారిన దినుసులను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని కందిపొడిలా ఇడ్లీ, దోశల్లోకి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండును నానిన నీళ్లతో సహా వేయాలి; అలాగే 3-4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. పచ్చడి కన్సిస్టెన్సీ కోసం కాచి చల్లార్చిన నీళ్లను కొద్దిగా పోస్తూ మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

స్టవ్‌పై చిన్న కడాయి పెట్టి 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత ఒక టీస్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు మరియు పావు టీస్పూన్ ఇంగువ వేసి దోరగా వేయించాలి. ఈ ఘుమఘుమలాడే తాలింపును గ్రైండ్ చేసుకున్న కంది పచ్చడిలో వేసి బాగా కలిపేయాలి.

అంతే, నోరూరించే కమ్మనైన 'కంది పచ్చడి' సిద్ధం ! పొగలు కక్కే వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసి, చెంచాడు స్వచ్ఛమైన నెయ్యి కలుపుకుని పక్కన ఉల్లిపాయ లేదా అప్పడం నంజుకుని తింటుంటే అమృతతుల్యంగా ఉంటుంది!