
హిమాచల్ ప్రదేశ్ మనాలి.. మనాలి అంటేనే మంచు, పర్వతాలు గుర్తొస్తాయి. వేసవిలో ఇక్కడి చల్లదనం ఎంతో హాయిగా అనిపిస్తుంది. పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, మంచులో క్రీడలు వంటివి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరిని ఆకట్టుకుంటాయి. సోలాంగ్ వ్యాలీ, రోహ్తాంగ్ పాస్ లాంటి ప్రదేశాలు చూసేందుకు బాగుంటాయి. ఇక్కడ హోటళ్ల ఖర్చు ఎక్కువగా ఉండదు. స్థానిక ఆహారం కూడా రుచిగా ఉంటుంది.

ఉత్తరాఖండ్ ఔలి.. ఔలికి వెళ్తే స్విట్జర్లాండ్ గుర్తుకొస్తుంది. పచ్చటి గడ్డి, మంచు పర్వతాలు, చల్లని గాలి ఇక్కడ ప్రత్యేకత. కేబుల్ కార్ రైడ్ చాలా పొడవుగా ఉంటుంది. ఆ రైడ్ నుంచి హిమాలయాలు చాలా అందంగా కనిపిస్తాయి. కుటుంబంతో కలిసి ఉండేందుకు హోమ్ స్టేలు, రిసార్ట్ లు బడ్జెట్ లో దొరుకుతాయి.

హిమాచల్ ప్రదేశ్ సిమ్లా.. వేసవిలో మొదట గుర్తొచ్చే ప్రదేశం సిమ్లా. మాల్ రోడ్‌లో షాపింగ్ చేయడం, కుఫ్రి వద్ద మంచు క్రీడలు చూడడం మంచి అనుభవం ఇస్తుంది. మషోబ్రా లాంటి చోట్ల ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. పిల్లల కోసం టాయ్ ట్రైన్, అడ్వెంచర్ పార్కులు ఉండటం వలన వారు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుబాటులో హోటళ్ళు, కేఫ్‌లు ఉండటం వల్ల ప్రయాణం సులభంగా సాగుతుంది.

మెక్ లియోడ్ గంజ్ ధర్మశాల.. బహుళ జనసంచారం లేని, ఆధ్యాత్మికతను అనుభవించాలనుకునే వారు ధర్మశాల లేదా మెక్ లియోడ్ గంజ్ వైపు చూడొచ్చు. ఇక్కడ వేసవిలో కూడా చల్లదనం ఉంటుంది. బౌద్ధ మఠాలు, జలపాతాలు, ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. పిల్లలతో కలసి వెళ్లాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. హోమ్ స్టేలు తక్కువ ధరకు లభించడంతో పాటు, పర్వత దృశ్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి.

ఉత్తరాఖండ్ నైనిటాల్.. నైనిటాల్ అంటేనే నైని సరస్సు గుర్తుకొస్తుంది. బోటింగ్ చేయడం, మంచు పర్వతాలు చూస్తూ రోప్ వేలో ప్రయాణించడం ఇక్కడ ప్రత్యేక అనుభవాలు. ఇక్కడ చల్లని వాతావరణం వేసవిలో ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. షాపింగ్‌కు అనువైన చిన్నచిన్న మార్కెట్లు కూడా ఉన్నాయి. బడ్జెట్‌కు అనుగుణంగా మంచి హోటళ్లు దొరుకుతాయి.