
మనీ ప్లాంట్: దీన్ని ఇంట్లో పెంచుకోవడం చాలా ఈజీ.. దీని పచ్చని ఆకులు ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా, గాలిని కూడా శుద్ధి చేస్తాయి. దీనిని మట్టిలోనూ, నీటిలోనూ పెంచవచ్చు. దీని తీగను కిటికీ గట్టు మీద, బాల్కనీలో లేదా వేలాడే కుండీలో నాటవచ్చు. దీనిని తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచి, అవసరమైనప్పుడు నీరు పోస్తే సరి.. ఇంటికి పచ్చదనాన్ని తీసుకురావడమే కాకుండా, ఇది గాలిని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది.

స్నేక్ ప్లాంట్: ఇంట్లో పెంచుకునే బెస్ట్ మొక్కల్లో ఇది కూడా ఒకటి .. దీని పొడవాటి ఆకులు ఇంటికి మంచి లుక్ను ఇస్తాయి. ఇది ఫార్మాల్డిహైడ్ వంటి హానికరమైన పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికి సూర్యరశ్మి కూడా ఎక్కువ అవసరం లేదు. దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు.. మట్టి ఎండినప్పుడు కాస్త నీరు పోస్తే సరి. ఇది గాలిని శుద్ది చేసి ఇంట్లో ఎప్పుడూ ఫ్రెష్ ఎయిర్ను ఉంచుతుంది.

పీస్ లిల్లీ: పీస్ లిల్లీ కూడా ఇంటి అందాన్ని పెంచడంతో గాలిని శుద్ధి చేయడంలో బాగా పని చేస్తుంది. దీని అందమైన తెల్లని పువ్వులు, ముదురు ఆకుపచ్చ ఆకులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్కను కూడా ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఇది గాలిలోని బెంజీన్, అమ్మోనియా, కొన్ని ఇతర హానికరమైన వాయువులను తగ్గిస్తుంది.అయితే పెంపుడు జంతువులు ఈ మొక్క దగ్గరకు రాకుండా చూసుకోవాలి.

స్పైడర్ ప్లాంట్: స్పైడర్ ప్లాంట్.. ఈ యొక్కకు ఉండే పొడవైన, ఆకుపచ్చ-తెలుపు ఆకులు దీని స్పెషల్ అట్రాక్షన్. ఈ మొక్కను పెంచడం కూడా చాలా సులభం. ఇది కార్బన్ మోనాక్సైడ్ ,ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని కాలుష్య కారకాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని ఇంట్లో బాగా వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచాలి. దీనికి ఎక్కవ నీరు పోయకుండా మట్టిని కొద్దిగా తేమగా ఉంచితే సరిపోతుంది.

కలబంద: కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని ఆకుల్లో ఉండే జల్ను చర్మ, జుట్టు సంరక్షణకు వాడుకోవచ్చు. అలాగే ఇది గాలిలోని హానికరమైన పదార్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని మంచి సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచాలి. దీనికి అధికంగా నీరు పెట్టాల్సిన అవసరం లేదు.