ప్రస్తుతం చలికాలంలో కూడా ఎండలు బాగా ఉంటున్నాయి. ఎండ ఉన్న సమయంలో హానికరమైన యూవీ కిరణాలకు గురికావడం వల్ల చర్మంపై టానింగ్ ఏర్పడుతుంది. టానింగ్‌ను తొలగించడానికి కాస్మటిక్స్ వాడకుండా కొన్ని సహజమైన పద్ధతులను ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలు మీ చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవేమిటో తెలుసుకుందాం..
కలబంద, నిమ్మరసం: కలబందకు చర్మాన్ని మెరిసిపోయేలా చేయగలిగే ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే కలబందతో టాన్‌ను కూడా తొలగించవచ్చు. ఒక గిన్నెలో అలోవెరా జెల్ తీసుకుని దానికి కాస్త నిమ్మరసం కలపండి. ఈ రెండింటినీ మిక్స్ చేసి ముఖం, మెడపై అప్లై చేయండి. ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే టాన్‌ను ఇట్టే తొలగించవచ్చు.
శనగ పిండి, పెరుగు: శనగపిండిలో ఉన్న ఔషధ గుణాలు చర్మం, జుట్టు సంరక్షణలో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. శనగపిండితో చర్మంపై టాన్‌ను తొలగించేందుకు ఒక గిన్నెలో చెంచా శనగ పిండిని తీసుకొని దానికి 2 చెంచాల పెరుగు కలపండి. దానికి కొంచెం అలోవెరా జెల్ కలపండి. వీటన్నింటిని మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉండనిచ్చిన తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేయవచ్చు.
పసుపు, శనగపిండి: పసుపు సహజంగానే చర్మానికి సంజీవని వంటిది. పసుపుతో చర్మ సంరక్షణ కోసం ఒక గిన్నెలో అర టీస్పూన్ పసుపు తీసుకొని అందులో ఒక చెంచా శెనగపిండి కలపాలి. దానికి కాస్త పెరుగు జోడించచి అన్నింటిని మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయండి. దీనిని అలాగే 20, 30 నిమిషాల పాటు ఉండనివ్వండి. దీని తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల వారం రోజులలో స్కిన్ టాన్ తొలగిపోతుంది.
పెసలు, టమాటో: టమాటోకి కూడా చర్మాన్ని సంరక్షించే గుణాలు ఉన్నాయి. అందుకోసం ఒక గిన్నెలో పెసరప్పును కొంత సేపు నానబెట్టండి. తర్వాత ఆ పప్పును పేస్ట్‌లా చేసుకుని దానికి టమాటో గుజ్జును కలపండి. దీన్ని చర్మంపై అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటు ఉంచి, తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి.