
అయితే జాతర ముగిసిన తర్వాత వచ్చే విశిష్టమైన రెండో మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకుని గంగమ్మ తల్లి మూలవిరాట్‌కు అర్చకులు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల స్వర్ణాభరణాలు, దగదగలాడే వజ్రాల కిరీటంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీంతో ఆలయ ముఖద్వారం కరెన్సీ నోట్ల తోరణాలతో సరికొత్త శోభను సంతరించుకుంది.

జాతర ముగిసినా గంగమ్మపై భక్తుల భక్తిప్రపత్తులు తగ్గలేదని నిరూపిస్తూ.. ఆలయ ప్రాంగణంలోని విశ్వరూప స్తూపం వద్ద పొంగళ్ళు పెట్టి అంబళ్ళు పోసిన భక్తులు వేషాలు వేసి ఆకట్టుకున్నారు కరెన్సీ అలంకరణలో ఉన్న తల్లిని దర్శించుకుని మురిసిపోయారు.

గంగమ్మ జాతర సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ పలువురు భక్తులు, కళాకారులు విభిన్న వేషధారణలతో అలరించారు. గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ పౌరాణిక పాత్రల వేషాలు ధరించి ఆలయానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నోట్ల కట్టల విశేష అలంకరణలో భక్తులకు అభయమిస్తున్న తాతయ్యగుంట గంగమ్మను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

వారం రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా జరిగిన తిరుపతి గంగమ్మ జాతరను విజయవంతంగా పూర్తి చేసిన ఆలయ పాలకమండలిని, అధికారులను, సిబ్బందిని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.