
ఇప్పపువ్వు లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు : పల్లీలు, ఇప్పపువ్వు, నువ్వులు, బెల్లం జీడిపప్పు, కిస్‌మిస్, నెయ్యి, యాలకులు.

తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకొని, స్టవ్ ఆన్ చేసి, అందులో ఒక కప్పు పల్లీలు, వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక కప్పు నువ్వులు వేసి, పచ్చి వాసన పోయి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు సన్నటి మంటపై వేయించుకోవాలి. తర్వాత మరో పాన్ తీసకొని, స్టవ్ పై పెట్టి, అందులో కొంచెం నెయ్యి వేసి, ఇప్ప పువ్వును వేయించుకోవాలి. తర్వాత దీనిని మరో బౌల్‌లోకి తీసుకొని, కిస్‌మిస్,జీడిపప్పు, బాదం కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు లడ్డూ తయారు చేసుకోవాలి. దీని కోసం ముందుగా మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా పల్లీలు, కిస్‌మిస్, జీడిపప్పు, బాదం, నువ్వులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పపువ్వును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాలను మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో బెల్లం వేసి, పాకానికి సరిపడ నీళ్లు పోసుకోవాలి. సరిగ్గా కొలతల ప్రకారం నీళ్లు పోసుకోవడం వలన పాకం బాగా వస్తుంది. దీని వలన లడ్డూ కూడా విరిగి పోకుండా మంచి ఆకారంలో వస్తాయి. మంట స్లిమ్‌లో పెట్టి పాకం వచ్చేలా చూసుకోవాలి.

తర్వాత కొంచెం నురగలా పాకం వచ్చే సమయంలో ఇలాచీ పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ పాకంలోనే మనం మిక్సీ పట్టుకున్న లడ్డూ మిశ్రమాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం గోరు వెచ్చగా ఉన్న సమయంలో లడ్డులలా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఆదివాసీల స్పెషల్ ఇప్పపువ్వు లడ్డూ రెడీ.