
సర్వ పిండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి రెండు కప్పులు, పచ్చి మిర్చీ ఐదు, వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు, జీలకర్ర, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, పల్లీలు, శనగపప్పు, నూనె, ఉప్పు.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా పచ్చిమిర్చీలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి, మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులోనే జీలకర్ర, చిటికెడు ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం కంటే, రోటిలో కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే మంచి రుచి వస్తుంది.

ఇలా రోటిలో దంచినదానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి తీసుకోవాలి. దీనిని జల్లించి ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం దంచి పక్కన పెట్టుకున్న పచ్చి మిర్చి కారం వేయాలి.

ఇవన్నీ వేసి కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ పిండిని మంచిగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత, దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వపిండి పెట్టడానికి బౌల్స్ తీసుకోవాలి. అందులో కొంచెం నూనె పోసి బౌల్ అడుగు బాగం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. ఇలా చేయడం వలన సర్వపిండి త్వరగా కాలుతుంది.

ఇప్పుడు కలిపి పెట్టుకున్న సర్వపిండి పిండిని చిన్న ముద్దలా చేసి, బౌల్‌లో వేసి చేతితో ఒత్తుతూ, సర్వపిండి ఆకారంలో చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, దానిపై బౌల్ పెట్టి, సర్వపిండిని మంచిగా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ సర్వపిండి రెడీ. మరి మీరు కూడా ట్రై చేయండి.