
మెదక్ జిల్లాకి చెందిన ఓ రైతు, సాంప్రదాయ పంటల మూస ధోరణి వీడి, వినూత్న ప్రయోగంతో కోట్లలో లాభాలు అర్జిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మెదక్ జిల్లా రామాయంపేట మండలానికి చెందిన సత్యనారాయణ అనే రైతు వ్యవసాయంలో సరికొత్త దారిని ఎంచుకున్నారు. తనకు ఉన్న 13 ఎకరాల వ్యవసాయ భూమిలో గతంలో ఎక్కువగా మలబార్, వేప, శ్రీగంధం చెట్లు పెంచేవాడు. ఒకసారి అనంతపూర్‌లో ఉన్న ఖర్జూర తోటను చూసి ఆకర్షణకు గురి అయ్యాడు..

అదే పంటను మన తెలంగాణ కూడా పండించాలని నిర్ణయం తీసుకున్నాడు. కాగా మన తెలంగాణలో ఉండే వాతావరణంలో ఈ పంట పండించడం సాధ్యమే అనే విషయాన్ని తెలుసుకొని, 2019 సంవత్సరంలో తొలిసారిగా 280 మొక్కలను లండన్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుని తన వ్యవసాయ భూమిలో నాటారు. వాటిని చాలా జాగ్రత్తగా పెంచాడు.

తన నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలంగా 2023 నుంచి ఈ చెట్లు అద్భుతమైన కాపుకు రావడంతో ఇక్కడి వాతావరణంలో పండిన ఖర్జూరాలు ఎంతో తీయగా, రుచికరంగా ఉండటంతో.. ఈయన ఉత్సాహంతో మరో 750 మొక్కలను ఇరాన్ టిష్యూ ల్యాబ్ నుంచి తెప్పించి సాగును మరింత విస్తరించారు. ఈ ఖర్జూర సాగులో పెట్టుబడి, నిర్వహణ పై సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఒక్కో మొక్కకు మార్కెట్ ధర మరియు నాణ్యతను బట్టి ఖర్చవుతుంది. అయితే,ఈ పంటకు ఒకసారి పెట్టుబడి పెడితే దాదాపు 60 నుండి 80 ఏళ్ల వరకు నిరంతరాయంగా ఫలసాయం అందుతుంది. ఈ ఖర్జూర చెట్లకు ఎక్కువ ఎండ, తక్కువ నీరు అవసరం ఉండడంతో, చెట్లకు డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని అందిస్తూ తక్కువ నీటితోనే ఎక్కువ లాభాలు సాధించారు.

ప్రస్తుతం ఒక్కో చెట్టు నుండి వందల కిలోల నాణ్యమైన బర్హీ రకం పండ్లు వస్తున్నాయి. ఈ పండ్లను కిలో 100 చొప్పున తోట వద్దే విక్రయిస్తూ ఏటా లక్షల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తున్నారు సత్యనారాయణ. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.