
ప్రస్తుతం ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ నెంబర్లను ఉపయోగించాలంటే మొదట లాగిన్‌లో ఉన్న అకౌంట్ నుంచి లాగవుట్ అయిన తర్వాతే.. మరో అకౌంట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. అయితే వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో ఇకపై ఆ అవసరం ఉండదు.

వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఒకే ఫోన్‌లో రెండు ఫోన్ నెంబర్లతో రెండు వాట్సాప్ ఖాతాలు ఉపయోగించుకోవచ్చని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. త్వరలోనే ఈ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు.

అయితే ఇంతకు ముందు ఇలా ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌లు ఉపయోగించాలంటే క్లోన్ యాప్‌లు లేదా థార్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించాల్సి ఉండేది. కానీ కొత్త ఫీచర్‌తో ఒకే ఫోన్‌లో రెండు సిమ్ నంబర్లపై వేర్వేరు వాట్సాప్ ఖాతాలు నిర్వహించుకోవచ్చు.

ప్రస్తుతం చాలా మంది యూజర్లు రెండు సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఒక అకౌంట్, వర్క్ కోసం మరో అకౌంట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వారి కోసమే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. అనంతరం రైట్ సైడ్‌లో మూడు డాట్‌లను క్లిక్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని. యాడ్ అకౌంట్‌ను క్లిక్ చేయాలి. దీంతో రెండో అకౌంట్ యాడ్ అవుతుంది. అవసరమైనప్పుడు రెండు ఖాతాల మధ్య స్విచ్ కావొచ్చు.