
ఏసీ ఆన్/ఆఫ్: మీరు గదిలో లేనప్పుడు లేదా మీకు ఏసీ అవసరం లేనప్పుడు ఏసీని ఆఫ్ చేయండి. అలా కాకుండా ఏసీని ఎక్కువ సమయం ఆన్‌లోనే ఉంచడం వల్ల కరెంట్ బిల్లు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది.

సరైన ఉష్ణోగ్రత: చాలా మంది ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద మంచి కూలింగ్ వస్తుందని అనుకుంటారు. కానీ 24 డిగ్రీల వద్ద స్థిరంగా ఉంచినా కూడా అదే చల్లదనం అందుతుంది. వీటికి తోడు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం.. మానవ శరీరానికి సరిపడిన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు. కాబట్టి 24 డిగ్రీల వద్ద ఏసిని ఉంచండి. తద్వారా చాలా ఎలక్ట్రిసిటీ అదా అవడంతో పాటు మీ కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.

స్లీప్ మోడ్: ప్రస్తుత కాలంలో అన్ని రకాల ఏసీ కంపెనీలు స్లీప్ మోడ్ ఫీచర్‌తో ఉన్న ఏసీలనే తీసుకొస్తున్నాయి. ఈ ఆప్షన్‌తో మీకు దాదాపు 36 శాతం విద్యుత్తు ఆదా అవుతుంది. ఏసీ అవసరం లేని సమయాల్లో, బయటకు వెళ్తున్నప్పుడు, ఉదయం వేళ, వాతావరణం చల్లగా ఉన్న సమయాల్లో ఏసీని స్లీప్ మోడ్‌లో ఉంచడం ద్వారా మరింత విద్యుత్ ఆదా చేయవచ్చు. ఫలితంగా కరెంట్ బిల్లుని కూడా తగ్గించుకోవచ్చు.

ఎయిర్ ఫిల్టర్స్: ప్రతీ వేసవి కాలంలో కొత్త ఏసీ కొనాలంటే ఆస్తులు సరిపోవు. అందువల్ల ఇంట్లో ఉన్న ఏసీనే సరైన రీతిలో ఉపయోగించాలి. అందుకోసం ఏసీని వాడుతున్న ప్రతిసారి కూడా ఎయిర్ ఫిల్టర్‌లోని దుమ్ము, ధూళిని శుభ్రపరచాలి. లేకపోతే వీటి కారణంగా ఏసీలో నుంచి గాలి సరిగా రాదు. ఫలితంగా గది త్వరగా చల్లపడకపోవడమే కాక కరెంట్ బిల్ అందుకోలేనంత ఎక్కువగా వస్తుంది. కాబట్టి కనీసం ప్రతి 60 రోజులకు ఒకసారి అయినా ఎయిర్ ఫిల్టర్లని శుభ్రం చేసుకోవడం మంచిది.

సీలింగ్ ఫ్యాన్: సర్వసాధారణంగా అందరూ ఏసీ, ఫ్యాన్ రెండూ ఆన్‌లో ఉండటం వల్ల ఎక్కువ కరెంటు బిల్ వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏసిని వేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేసుకోవడం వల్ల గది అంతటా చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది. ఒకవేళ ఫ్యాన్ వేసుకోకపోతే గాలి స్ప్రెడ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఫలితంగా కరెంట్ బిల్లు పెరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఏసీ ఆన్ చేసినప్పడు సీలింగ్ ఫ్యాన్‌ని ఆన్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కరెంట్ బిల్ తగ్గుతుంది.