
కావలసిన పదార్థాలు : 2 లీటర్ల చిక్కటి పాలు, ముప్పావు కప్పు పంచదార, పావు కప్పు వైట్ వెనిగర్, నీళ్లు, 1 చిటికెడు నిమ్మ ఉప్పు లేదా 5 నుండి 6 చుక్కల నిమ్మరసం 6 నుండి 7 యాలకులు లోపలి గింజలు మాత్రమే, గార్నిషింగ్ కోసం కొద్దిగా పిస్తా పలుకులు & బాదం తరుగు, ట్రేలో పరవడానికి బటర్ పేపర్

తయారీ విధానం: ఒక పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి, 1 లీటర్ చిక్కటి ఫుల్ ఫ్యాట్ పాలను పోయాలి. అడుగున నీళ్లు పోస్తే పాలు అంటుకోవు. గరిటెతో కలుపుతూ మీగడ కట్టకుండా ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక గిన్నెలో పావు కప్పు వెనిగర్, పావు కప్పు నీళ్లు కలిపి ఉంచుకోవాలి. ఈ వెనిగర్ నీటిని కొద్దికొద్దిగా పాలల్లో పోస్తూ నెమ్మదిగా కలపాలి. 3-4 నిమిషాల్లో పాలు విరిగి ఆకుపచ్చటి నీరు, తెల్లటి పన్నీర్ వేరవుతాయి.

వెంటనే స్ట్రైనర్ పై కాటన్ క్లాత్ వేసి పన్నీర్‌ను వడకట్టాలి. వెనిగర్ పులుపు పోయేలా పైనుంచి చల్లటి నీళ్లు పోస్తూ శుభ్రంగా కడగాలి. పన్నీర్ పూర్తిగా చల్లారిన తర్వాత క్లాత్‌ను గట్టిగా పిండి నీరంతా తీసేసి పక్కన ఉంచుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పిండకూడదు. మరో గిన్నెలో రెండో లీటర్ చిక్కటి పాలను పోసి ఒక పొంగు రానివ్వాలి. పాలు పొంగు రాగానే ముప్పావు కప్పు పంచదార వేయాలి.

మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో ఆపకుండా కలుపుతూ పాలను మరిగించాలి. సిమ్ లో పెడితే రంగు మారుతుంది కాబట్టి హై ఫ్లేమ్ మాత్రమే వాడాలి. సుమారు 20 నిమిషాలకు పాలు చిక్కబడి 350 ml పరిమాణానికి వస్తాయి. ఈ సమయంలో 1 చిటికెడు నిమ్మ ఉప్పు లేదా 5-6 చుక్కల నిమ్మరసం వేయాలి. దీనివల్ల పాలల్లో సన్నని పూసలాంటి పలుకులు ఏర్పడతాయి.

పాలు చిక్కగా మారిన తర్వాత.. ముందుగా సిద్ధం చేసుకున్న మృదువైన పన్నీర్‌ను చేత్తో పొడిచేస్తూ వేయాలి. పన్నీర్లో పెద్ద పెద్ద గడ్డలు ఉంటే గరిటె వెనుక భాగంతో మెదుపుతూ కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పన్నీర్‌లోని తేమ అంతా పూర్తిగా ఆవిరైపోయి.. మిశ్రమం దగ్గరపడి ముద్దలా మారేంత వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 6-7 యాలకల నుండి తీసిన తాజా గింజలను వేసి బాగా కలపాలి. పంచదార కరిగి లేత జిగురును ఏర్పరుస్తుంది. ఒక చతురస్రాకార ట్రే లేదా ప్లేట్లో బటర్ పేపర్ పరచి.. వేడి కలాకంద్ మిశ్రమాన్ని సమానంగా పరవాలి. స్పూన్‌తో పైన లెవెల్ చేసి.. సన్నగా తరిగిన పిస్తా పలుకులు, బాదం ముక్కలను చల్లాలి. దీనిపై ఒక పల్చటి కాటన్ క్లాత్ కప్పి గది ఉష్ణోగ్రత వద్ద సుమారు 12 నుండి 16 గంటల పాటు (రాత్రంతా) కదపకుండా వదిలేయాలి.

12 గంటల తర్వాత కలాకంద్ చక్కగా గట్టిపడి సెట్ అవుతుంది. బటర్ పేపర్‌తో సహా బయటకు తీసి.. పదునైన చాకుతో చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ 'పన్నీర్ కలాకంద్' సిద్ధం! స్పూన్‌తో లేదా చేత్తో తుంచుతుంటే జ్యూసీగా ఉంటూ, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతూ యాలకుల గింజల క్రంచీనెస్‌తో ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది!