
తెలుగురాష్ట్రాల్లో మండుతున్న ఎండలు మనుషులనే కాదు పశుపక్షాదులకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గడిన మూడు రోజుల్లో భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా సుమారు 15 లక్షల కోళ్లు మృతి చెందాయి.ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో దాదాపు 10 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 4 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్లు సమాచారం. ఇక కృష్ణా జిల్లాలో సుమారు 4 లక్షలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మరో 2 లక్షల వరకు కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ ఫెడరేషన్ వర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా కోళ్లు 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయి. అయితే ఈసారి అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల వరకు నమోదవడంతో షెడ్లలో వేడి తీవ్రంగా పెరిగింది. దీంతో కోళ్లు వడదెబ్బకు గురై పెద్దఎత్తున చనిపోతున్నాయని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. పౌల్ట్రీ రంగంలో గత దశాబ్దంలో ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఎదురైందని అంటున్నారు.

వడదెబ్బకు గురైన కోళ్లలో ముందుగా మేత తినడం తగ్గిపోవడం, ఎక్కువగా నీళ్లు తాగడం, నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోళ్లు ఒకేచోట గుంపులుగా చేరిపోవడం కూడా కనిపిస్తుందని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కోళ్లకు చల్లటి, పరిశుభ్రమైన నీటిని ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు. నీటిలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్-సి, బెల్లం కలిపి ఇస్తే వేడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. వేసవిలో కోళ్లు తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండటంతో మేతను విడతల వారీగా అందించాలని, ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం, అర్ధరాత్రి సమయాల్లో మేత పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.

అలాగే షెడ్లపై సున్నం లేదా తెల్లని పెయింట్ వేయడం, గ్రీన్ నెట్లు, తాటి ఆకులు, గడ్డి వంటి వాటితో కప్పడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. ఫ్యాన్లు, ఫాగర్లు, స్ప్రింక్లర్ల వినియోగంతో షెడ్లలో ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే అవకాశం ఉందని, అయితే నీటిని నేరుగా కోళ్లపై చల్లకూడదని హెచ్చరిస్తున్నారు.