
శ్రీశైలం రిజర్వాయర్ కి మంచి రోజులు రానున్నాయి. మూడు రోజుల్లో గా రిజర్వాయర్ కి వరద నీరు రానుంది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ డాం ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న జూరాలకు కృష్ణన్న పరుగులు తీస్తోంది.

ఇప్పటికే జూరాలలో తగినంత నీరు ఉన్నందున గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో మరో మూడు రోజుల్లోపే శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు దాదాపు డెడ్ స్టోరేజీ లో ఉంది.

పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 41 టిఎంసిలు మాత్రమే ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 820.9 అడుగుల మేర నీటిమట్టం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలం పూర్తిగా నిండిపోయి నాగార్జునసాగర్ కి విడుదల చేసిన పరిస్థితి ఉంది.

సూపర్ ఎల్ నినో కారణంగా ఈసారి వర్షాలు లేక వరద లేక శ్రీశైలం బోసిపోయిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో మరో మూడు రోజుల్లోగా శ్రీశైలంకి కచ్చితంగా వరద నీరు వచ్చి చేరనుంది. ఆల్మట్టి ఎగువ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఇంకా నీరు వచ్చే అవకాశం ఉంది.

ఈ మొదటి విడత కింద శ్రీశైలం రిజర్వాయర్ కి మరో 10 రోజుల్లో 20 టీఎంసీలు నీరు చేరే అవకాశం కనిపిస్తుంది. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా తాగునీటి అవసరాలకు కొంతలో కొంత ఉపయోగపడే అవకాశం ఉంది.