
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మొత్తం ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన యంగ్ టీమిండియా.. ఇప్పటికే 3 టెస్టులు పూర్తి చేసుకుంది. ఇంగ్లాండ్ గట్టి పోటీ ఇస్తున్న గిల్ సేన ప్రస్తుతానికి 1-2తో సిరీస్‌లో వెనుకబడి ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బుధవారం నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా యంగ్ అండ్ ఎనర్జిటిక్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే.. కచ్చితంగా గెలవాల్సిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడుతున్నట్లు వెల్లడించాడు.

బుమ్రా టీమ్‌లో ఉండే వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లే. నిజానికి ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో బుమ్రా కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడతాడంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రకటించి ఉన్నాడు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్ సమస్యలు, గాయాల బెడద ఇవన్నీ లెక్కలేసుకొని బుమ్రాను కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ముందే ప్లాన్ చేసుకుంది.

బుమ్రా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేశాడు. తొలి మ్యాచ్, మూడో టెస్ట్ ఆడాడు. ఇక మిగిలిన చివరి రెండు మ్యాచ్‌ల్లో బుమ్రా కేవలం ఒకే మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. నాలుగో టెస్టుకు బుమ్రాకు రెస్ట్ ఇచ్చి చివరి టెస్ట్ ఆడిస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ బుమ్రా నాలుగో టెస్ట్ బరిలోకి దిగడం ఖాయం అయిపోయింది.

ఎందుకంటే.. ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ ఇద్దరు గాయపడటంతో ఇక బుమ్రా కచ్చితంగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా సిరీస్ సమం చేసి.. చివరి టెస్ట్‌పై ఆశలు పెట్టుకోవాలంటే నాలుగో టెస్టును టీమిండియా కచ్చితంగా గెలవాలి. అలా జరగాలంటే సూపర్ ఫామ్‌లో ఉన్న బుమ్రా మ్యాచ్ ఆడాల్సిందే.