
ప్రస్తుతం తన స్వస్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి వల్ల కొన్ని రాశుల వారికి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు లభించే అవకాశం ఉంది. వృషభ రాశి సహజ కుటుంబ స్థానం అయినందువల్ల ఈ రాశిలో శుక్రుడి సంచారం పెళ్లి ప్రయత్నాలకు, పెళ్లిళ్లకే కాక, ప్రేమలకు కూడా బాగా అనుకూలంగా ఉంది. జూన్ మొదటి వారంలోగా కొన్ని రాశుల వారి పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. శుక్రుడి అనుకూలత ఉన్న మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి పెళ్లి, ప్రేమల విషయంలో సమయం బాగా అనుకూలంగా ఉంది.

మేషం: ఈ రాశివారికి కుటుంబ స్థానంలో కుటుంబ స్థానాధిపతి శుక్రుడి సంచారం వల్ల తప్పకుండా అతి త్వరలో పెళ్లి యోగం కలుగుతుంది. శుక్రుడు వృషభరాశిలో ఉన్న సమయంలో పెళ్లి ప్రయత్నాలు చేపట్టడం చాలా మంచిది. ఈ రాశికి చెందిన వధూవరులకు సాధారణంగా విదేశీ సంబంధమే కుదిరే అవకాశం ఉంది. ఎక్కువగా విదేశీ సంబంధాలనే ప్రయత్నించడం మంచిది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది.

వృషభం: ఈ స్థిర రాశిలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి అతి సమీప భవిష్యత్తులో తప్పకుండా పెళ్లి జరిగే యోగం ఉంది. స్వదేశీ సంబంధమే, అందులోనూ బంధువర్గానికి చెందిన సంబంధమే అయ్యే సూచనలున్నాయి. స్వదేశంలోనే ఎక్కువగా సంబంధాలకు ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు లేదా ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. జూలై ప్రాంతంలో పెళ్లి జరిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో గురు, శుక్రుల యుతి వల్ల సమీప భవిష్యత్తులో పెళ్లి యోగం ఉంది. చిన్న ప్రయత్నంతో సంబంధం కుదురుతుంది. సాధారణంగా ఈ రాశివారికి ప్రస్తుతం విదేశీ సంబంధం కుదరడానికే అవకాశం ఉంది. ఎక్కువగా విదేశీ సంబంధాలకు ప్రయత్నించడమే మంచిది. ఇష్టపడిన వ్యక్తితో గానీ, ప్రేమించిన వ్యక్తితో గానీ పెళ్లి జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు సంబంధం కుదిరే అవకాశం ఉన్నప్పటికీ, జూలై తర్వాతే పెళ్లి జరిగే సూచనలున్నాయి.

కన్య: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఈ రాశివారికి తప్పకుండా త్వరలో వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ప్రేమలో పడే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. గ్రహ సంచారాన్ని బట్టి బంధువర్గంలో పెళ్లయ్యే అవకాశం ఉంది. స్వదేశీ సంబంధాలకన్నా విదేశీ సంబంధాలకు ప్రయత్నించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉంది.

వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో, అంటే వివాహ స్థానంలో, సప్తమాధిపతి శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. రెండు నెలల్లో ఆశించిన సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్వదేశీ సంబంధమే ఖాయం కావచ్చు. విదేశీ సంబంధాల కన్నా స్వదేశీ సంబంధాల మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల ఉపయోగముంటుంది. ప్రేమించిన వ్యక్తితో గానీ, పరిచయస్థులతో గానీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. పెళ్లి వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరుగుతుంది.

మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల ఈ రాశివారికి జూలై ప్రాంతంలో వివాహం జరిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. సాధారణంగా ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువర్గంలో పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది. విదేశీ సంబంధాల కన్నా స్వదేశీ సంబంధం కుదరడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాగా సంపన్న కుటుంబంతో సంబంధం కుదిరే సూచనలున్నాయి.