
మేషం: ప్రేమ వ్యవహారాల్లో ఎంతో దూకుడుగా, చొరవగా వ్యవహరించే తత్వం కలిగిన ఈ రాశివారు కొద్ది రోజుల పాటు నిదానంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ రాశికి ఆరవ స్థానంలో శుక్రుడు నీచబడుతున్నందువల్ల వీరు ఆశాభంగాలను ఎదుర్కోవలసిని పరిస్థితులు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా సాగకపోవచ్చు. కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. దాంపత్య జీవితంలో కూడా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది.

మిథునం: ఇతరులతో మాట్లాడడంలో, స్నేహాలు, బంధాలు ఏర్పరచుకోవడంలో ఈ రాశివారు దిట్టలు. అయితే, ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాల్లో ఈసారి వీరి ప్రతిభా పాటవాలు కొద్దిగా బెడిసికొట్టే అవకాశం ఉంది. అపార్థాలు చోటు చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. ఎడమొహం, పెడమొహం తప్పకపోవచ్చు. తొందరపాటుతనంతో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

కర్కాటకం: బాగా లౌక్యంగా, ఆచితూచి వ్యవహరించడంతో పాటు, మొండి పట్టుదలగా కూడా కలిగి ఉండే ఈ రాశివారు కొద్ది రోజుల పాటు బాగా ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో వాదాపవాదాలు, అభిప్రాయభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సఖ్యత, సాన్నిహిత్యాలు బాగా తగ్గే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా కొద్దిపాటి నిరాశా నిస్పృహలు తప్పకపోవచ్చు. దాంపత్య జీవితంలో ఈగో సమస్యల వల్ల సుఖ సంతోషాలు తగ్గుతాయి.

తుల: ఈ రాశివారు సాహసాలు చేయడమంటే ఇష్టపడతారు. ఆశల్ని, ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి అవసరమైతే ఎటువంటి ధైర్య సాహసాలకైనా ఒడిగడతారు. అయితే, కొద్ది రోజుల పాటు ఇవన్నీ చెల్లకపోవచ్చు. ప్రేమ ప్రయత్నాలకు అవసరమైన ఓర్పు, సహనం వీరిలో బాగా లోపించే అవకాశం ఉంది. రాశినాథుడైన శుక్రుడు నీచబడడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేయలేకపోతారు. పెళ్లిప్రయత్నాల్లో ఆశాభంగాలు కలుగుతాయి. దాంపత్య జీవితం సజావుగా సాగకపోవచ్చు.

కుంభం: ఈ రాశివారు దేన్నయినా పట్టుదలగా సాధించుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించడం వీరి నైజం. శృంగార దేవత అయిన శుక్రుడు ఈ రాశికి అష్టమంలో సంచారం చేయడం వల్ల ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు, దాంపత్య జీవితం, శృంగార జీవితం వంటి విషయాల్లో వీరికి ఓ మూడు వారాల పాటు నిరాశా నిస్పృహలు తప్పకపోవచ్చు. ప్రతి విషయంలోనూ అపార్థాలు, వివాదాలు, వాదోపవాదాలు తలెత్తుతుంటాయి. ప్రేమను సాధించుకోవడానికి నానా కష్టాలూ పడే అవకాశముంది.

మీనం: అన్ని విషయాల్లోనూ సహనంతో వ్యవహరించే ఈ రాశివారు ప్రేమ వ్యవహారాల విషయానికి వచ్చే సరికి కొద్దిగా అసహనంతో వ్యవహరించే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా సఖ్యత, సాన్నిహిత్యాలు పెరగకపోవచ్చు. ప్రేమ భాగస్వామి అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో అకారణ ఆలస్యాలకు బాగా అవకాశం ఉంది. అనారోగ్యాలు, కుటుంబ సమస్యల వల్ల దాంపత్య జీవితంలో కూడా చికాకులు తలెత్తుతాయి.