
శ్రీ రామ నవమి పర్వదినాన్ని 27వ తారీఖున అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. రాముడు ఎందరికో ఆదర్శప్రాయుడు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయనను తమ మనసుల్లో ఆరాధిస్తారు. రాముడిని పూజించడం అంటే కేవలం కొన్ని ఆచారాలు పాటించడం మాత్రమే కాదు, ఆయన బోధించిన ధర్మాన్ని, సత్యనిష్ఠను జీవితంలో ఆచరించడమే నిజమైన పూజ అని పండితులు చెబుతున్నారు.

ఎలా పూజ చేయాలి..?.. రామ నవమి రోజున పూజ ఎలా చేయాలి అని కొందరు ప్రశ్నిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. రామ పట్టాభిషేకం చిత్రపటాన్ని ప్రతిష్ఠించి, బొట్టు పెట్టి అలంకరించాలి. అనంతరం దీపారాధన చేసి, మీకు తెలిసిన రాముడి స్తోత్రాలు, శ్లోకాలు పఠించాలి. షోడశోపచార పూజ చేయగలిగితే అలాగే చేయవచ్చు. ఒకవేళ ఇవేమీ తెలియనివారు బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు రామకథను స్మరించుకోవడం, సుందరకాండ పారాయణం చేయడం లేదా కేవలం "రామా" అని నామ జపం చేయడం ద్వారా కూడా రాముడికి ప్రీతికరమైన పూజ చేసినట్లే అవుతుంది.

రాముడు చూపిన బాటలో.. అయితే, రాముడిని నిజంగా పూజించడం అంటే ఆయనను దేవుడిగా కొలవడమే కాదు, ఆయన చూపిన బాటలో నడవడమని గ్రహించాలి. రాముడు "ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య" అన్నట్లుగా తన మాటను నిలబెట్టుకున్నాడు. మనం కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బంధాలకు, బాంధవ్యాలకు విలువ ఇవ్వడం, తల్లిదండ్రుల మాటను జవదాటకపోవడం, స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి రాముడి జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. విభీషణుడు శరణు కోరినప్పుడు, రావణాసురుడు శరణు కోరినా ఆశ్రయం ఇస్తానని రాముడు చెప్పడం ఆయన శరణాగత వత్సలత్వాన్ని తెలియజేస్తుంది. ఆయన ఎవరినీ నిందించలేదు, దూషించలేదు కానీ అధర్మాన్ని మాత్రం సహించలేదు. రాముడికి కోపం ఉన్నప్పటికీ, అది ఆయన నియంత్రణలో ఉండేది. కోపాన్ని ఎంతవరకు ప్రదర్శించాలో, ఎలా మాట్లాడాలో, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో ఆయనకు తెలుసు.

మానవుడిగా మనకు ఆదర్శంగా నిలిచి.. శబరిమాత రాముడి కోసం సంవత్సరాలు ఎదురుచూసి మోక్షం పొందింది. గుహుడు రామచంద్రమూర్తి అనుగ్రహంతో అదృష్టవంతుడయ్యాడు. పట్టాభిషేకం అనగానే పొంగిపోకుండా, అరణ్యవాసానికి సిద్ధపడినప్పుడు నిందించకుండా, తండ్రి మాటను శిరసావహించాడు. సీతమ్మ అపహరించబడినప్పుడు కూడా రామచంద్రమూర్తి కుంగిపోలేదు, తన బాధ్యతను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాడు.

అదే నిజమైన పూజ.. రాముడు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారమే అయినప్పటికీ, మానవుడిగా మనకు ఆదర్శంగా నిలిచి, ఎలా జీవించాలో తాను పాటించి చూపించాడు. కేవలం రాముడి ఫోటో పెట్టుకొని పూజలు చేయడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన ధర్మాన్ని పాటించడం, బాధ్యతలను నిర్వర్తించడం, ఇతరులను బాధపెట్టకుండా జీవించడమే నిజమైన పూజ. అప్పుడే మనకు రాముడి అనుగ్రహం లభిస్తుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)