
ఈ నెల (నవంబర్) 17 నుంచి శని వక్ర గతి నుంచి బయటపడడం ప్రారంభమైంది. డిసెంబర్ 13 నుంచి శని రుజు వర్తనలోకి వస్తాడు. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న శని కొన్ని రాశులకు యోగకారకుడుగా మారి పూర్తి ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి పనినీ నత్తనడకగా పూర్తి చేసే శనీశ్వరుడు ఇక నుంచి వేగంగా, సానుకూలంగా పనులు, ప్రయత్నాలు, కార్యకలాపాలను పూర్తి చేయడం జరుగుతుంది. శనిలో వస్తున్న మార్పు వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి రాజయోగం పడుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మిగిలిన రాశులవారితో పాటు ఈ రాశులవారు కూడా శనికి తరచూ దీపం వెలిగించడం మంచిది.

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న భాగ్య, దశమాధిపతి శని క్రమంగా రుజు మార్గంలోకి వస్తున్నందువల్ల క్రమంగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం ప్రారంభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. మంచి ఉద్యోగానికి సంబంధించి ఆఫర్ అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న శనైశ్చరుడు వక్రగతి నుంచి బయటపడుతున్నం దువల్ల ఉద్యోగంలో క్రమంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఈ రాశివారికి గతంలో అందాల్సిన పదోన్నతులు ఇప్పుడు అందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఇక బాగా జోరందుకుంటాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి సప్తమ, అష్టమ స్థానాధిపతి అయిన శని రుజు మార్గంలోకి వస్తున్నందువల్ల ఈ రాశి వారికి తప్పకుండా విదేశీ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదన యోగం పడుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సొంత ఇంటి కల సాకారమవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన శని షష్ట స్థానంలో వక్రగతి నుంచి బయటపడుతున్నందువల్ల ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభించి, హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయక మార్పులు చేపట్టి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి యోగం పడుతుంది.

వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న శని రుజు మార్గంలోకి వస్తుండడంతో జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతాలకు స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

మకరం: రాశ్యధిపతి శని ఈ రాశికి తృతీయ స్థానంలో రుజు మార్గంలోకి వస్తున్నందువల్ల ఏ రంగంలోని వారికైనా శీఘ్ర పురోగతి ఉంటుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో భారీగా లాభాలు అందుతాయి. ప్రయాణాల వల్ల, పరిచయాలు వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి.