
రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతకు ప్రతీక.. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి వారి సుఖసంతోషాలను కోరుకుంటారు.. ఈ పండుగ కోసం అక్కలు, చెల్లెళ్లు.. ఎంతో కాలం నుంచి వేచిచూస్తుంటారు. అయితే.. రాఖి పండుగ జరుపుకునే రోజు విషయంలో ఎన్నో అనుమానాలున్నాయి..

అయితే.. రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) 2026 ఆగస్టు 28న (శుక్రవారం) జరుపుకోవాలని వేద పండితులు స్పష్టం చేశారు. పూర్ణిమ తిథి ఆగస్టు 27న ప్రారంభమైనప్పటికీ, సూర్యోదయ తిథి, భద్ర కాలం నియమాల ప్రకారం ఆగస్టు 28న పండుగ జరుపుకోవాలి.. అంటే శుక్రవారం.. పౌర్ణమి ప్రారంభం: 27 ఆగస్టు 2026, ఉదయం 09:08 గంటలకు, పౌర్ణమి ముగింపు: 28 ఆగస్టు 2026, ఉదయం 09:48 గంటలకు..

రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం: రాఖీ కట్టడానికి ఆగస్టు 28 ఉదయం 05:57 నుండి ఉదయం 09:48 వరకు అత్యంత పవిత్రమైన ముహూర్తంగా నిర్ణయించారు. ముహూర్తం వ్యవధి: 3 గంటల 51 నిమిషాలు.. ఉదయం పూట వీలుకాని వారికి అపరాహ్న ముహూర్తం మధ్యాహ్నం 01:46 నుండి 04:20 వరకు కూడా రాఖీ కట్టుకోవచ్చని పండితులు తెలిపారు.

శాస్త్రాల ప్రకారం భద్ర కాలంలో రాఖీ కట్టడం తీవ్ర అశుభంగా పేర్కొంటారు. అందుకే.. ఆగస్టు 28 సూర్యోదయ సమయానికి భద్ర కాలం పూర్తిగా ముగిసిపోతుంది కాబట్టి, ఆగస్టు 28నే శ్రావణ పౌర్ణమి వేడుకలను జరుపుకోవాలంటున్నారు.

నోట్ : ఈ వార్తలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.