
రోహిణి కార్తె సమయంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25న ప్రారంభమై, జూన్ 8న పూర్తి అవుతుంది, ఆ రోజు నుంచి మృగశిర కార్తె ప్రారంభం కాబోతుంది. మృగశిర కార్తెలో ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోతుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవానాలు వచ్చి, తొలకరి చినుకులు కురుస్తాయి. తర్వాత భారీ వర్షాలు పడతాయి.

ఇక మృగశిర కార్తె అంటే, సూర్యడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని మృగశిర కార్తె అంటారు. ఈ సమయంలో తొలకరి చినుకులు పడటంతో రైతులు వ్యవసాయం పనులు మొదలు పెడతారు, దుక్కి దున్ని, విత్తనాలు నాటడం వంటి పనులు చేస్తుంటారు.

అందుకే చాలా మంది రైతులు మృగశిర కార్తె కోసం చాలా ఆశగా ఎదురు చూస్తుంగారు. ఇక హిందూ పంచాంగం ప్రకారం, 2026 పరాభవ నామ సంవత్సరంలో సూర్యుడు జూన్ 8న మృగశిర కార్తెలోకి ప్రవేశించి, జూన్ 22 వరకు అక్కడే ఉంటాడు. జూన్ 23 మళ్లీ సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయడంతో ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. ఇక ఆరుద్ర కార్తెలో వర్షాలు దంచికొడతాయి అంటారు.

మొదట అంటే జూన్ 8 నుంచి తొలకరి చినుకులతో వర్షాలు ప్రారంభం అవుతాయి. రెండో వారం నుంచి వానలు పడటమే కాకుండా, నైరుతి రుతుపవనాలు ఆకాశాన్ని చుట్టేసి, వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఆరుద్ర కార్తె నుంచి విపరీతంగా వర్షాలు పడతాయి. దాదాపు పొలం పనులు అన్నీ కూడా ఈ కార్తె వరకు పూర్తి అవుతాయి. ముఖ్యంగా రైతులు మృగశిర సమయంలో పొలం పనులు మొదలు పెట్టి విత్తనాలు నాటుతారు. ఎందుకంటే? ఈ సమయంలో వర్షం పడి విత్తనం పెడితే, పంట బాగా వస్తుందని వారి నమ్మకం.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు