
విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాల్లో కైలాసగిరి ఒక ప్రత్యేక స్థానం. కైలాసగిరి అంటే వెంటనే గుర్తు వచ్చేది ఆ కొండపై ఏర్పాటు చేసిన భారీ శివపార్వతుల విగ్రహాలు.. అవే వైజాగ్‌కి సింబాలిక్‌గా కూడా మారాయి. ఆ తర్వాత కైలాసగిరి పర్యాటకంగా ఒక హాట్ స్పాట్‌గా ప్రాచుర్యం పొందింది. రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్, టాయ్ ట్రైన్, తెలుగు మ్యూజియం... ఇలా ఎన్నో ప్రాజెక్టులు పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. వాటి సరసన మరో అద్భుతమైన పర్యాటక ఆకర్షణగా రూపుదిద్దుకుంది భారీ త్రిశూలం.

సిటీ అఫ్ డెస్టీనీగా పేరుగాంచిన విశాఖలో ఈ మధ్య కాలంలో చాలా టూరిజం ఎట్రాక్షన్స్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇందులో భాగంగా.. కైలాసగిరిపై భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేసింది వైజాగ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ - విఎంఆర్డీఏ. కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన 65 అడుగుల పొడవైన డమరుకంతో కూడిన త్రిశూలాన్ని నిర్మించారు. శివుడి ప్రధాన ఆయుధమైన ఈ త్రిశూలం వైజాగ్‌లోని ముఖ్య ప్రాంతాల నుంచి చూస్తే కనపడేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఈ భారీ త్రిశూలాన్ని శనివారం నాడు అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరవుతున్నారు.

రెండున్నర కోట్లతో.. పుణేలో డిజైన్ చేసి.. వైజాగ్‌లో కైలాసగిరి అంటే వెంటనే గుర్తు వచ్చేది ఆ కొండపై ఏర్పాటు చేసిన శివ పార్వతుల విగ్రహాలు. వాటికి తోడు ఒక భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేయాలని విఎంఆర్డిఏ సంకల్పించింది. దానికోసం రూ. 2.50 కోట్లు బడ్జెట్ కేటాయించి డిజైన్లు పరిశీలించారు. చివరకు పుణేలో ఈ డిజైన్‌ని సెలెక్ట్ చేసి దాన్ని అక్కడే డిజైన్ చేసి.. కైలాసగిరి కొండకు తీసుకొచ్చి వాటిని ఇన్స్టాల్ చేశారు. కైలాసగిరి కొండకు మరోవైపున ఈ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. టూరిజంతో పాటు ఆధ్యాత్మికం రెండూ ఉట్టిపడే 65 అడుగుల ఎత్తుతో ఉండే భారీ త్రిశూలం కైలాసగిరిపై రూపుదిద్దుకుంది.

రాత్రిపూట మరింత ఆకర్షణగా.. పగటిపూట విశాఖలోని ముఖ్య ప్రాంతాల నుంచి కైలాసగిరి వైపు చూస్తే కనబడుతుంది. రాత్రి వేళల్లో ఈ త్రిశూలం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చిమ్మ చీకటిలో సైతం.. కాంతులీనేలా 110 వాట్ల శక్తివంతమైన ఎల్ఈడి బల్బులను ఈ డమరుకంతో కూడిన భారీ త్రిశూలానికి అమర్చారు. 65 అడుగుల ఎత్తున ఈ భారీ త్రిశూలానికి.. ఢమరుకం 25 అడుగులు. వెడల్పు 18 అడుగులు. దాంతోపాటు చుట్టూ ముప్పై అడుగుల విస్తీర్ణంలో ఒక వేదికను కూడా నిర్మించారు. పర్యటకులు ఎంచక్కా సెల్ఫీలు తీసుకునే విధంగా, ఆ ప్రాంతంలో సేద తీరే విధంగా ఏర్పాట్లు చేశారు.

బలమైన తుఫానులను సైతం తట్టుకునేలా.. మోడరన్ టెక్నాలజీతో ట్రాన్స్ లూసెంట్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో ఈ త్రిశూలాన్ని నిర్మించారు. ఈ త్రిశూలం సహజంగా వైజాగ్ తీరంలో వచ్చే తుఫాన్లను బలమైన గాలులను కూడా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుందని విఎంఆర్డిఏ చైర్మన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా కైలాసగిరిలో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుందని టూరిస్టులకు కొత్తరకం అనుభూతిని ఇవ్వడమే తమ లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు.

వైజాగ్‌లో బీచ్ ఎంత ఫేమస్సో.. కైలాసగిరి కొండ కూడా అంతే ఫేమస్. ప్రతి ఏటా కనీసం మూడు లక్షల మంది టూరిస్టులు కైలాసగిరి కొండను విజిట్ చేస్తూ ఉంటారు. వీరిలో విదేశీ టూరిస్టులు కూడా ఉంటారు. కైలాసగిరి నుంచి విశాఖలోని సముద్ర తీరాన్ని చూడడం ఒక మరుపురాని అనుభూతిగా పర్యాటకులు చెబుతూ ఉంటారు. అందుకే 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కైలాసగిరిని బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌గా ఎంపిక చేసింది. ఈ కొండ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి పది కిలోమీటర్ల దూరంలోనూ.. ద్వారకా బస్ స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ త్రిశూలం వద్ద ఎలాంటి ఫీజు వసూలు చేయబోవడం లేదు. పూర్తిగా ఉచితమని అధికారులు చెబుతున్నారు. దానితో వీకెండ్ లోనూ హాలిడేస్ లోనూ ఫ్యామిలీతో సరదాగా వెళ్లడానికి అనువుగా ఉండే కైలాసగిరిపై ఈ త్రిశూల్ వల్ల మరొక కొత్త ఆకర్షణ వచ్చినట్టే అయిందని అంటున్నారు వైజాగ్ వాసులు.