
మేషం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు శుభ గ్రహంగా మారడం వల్ల విదేశీ అవకాశాలు లభిస్తాయి. వీసా సమస్యలు, విదేశాల్లో స్థిర నివాస సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం అయ్యే అవకాశం ఉంది కానీ, కులాంతర, మతాంతర వివాహానికి అవకాశం ఉంది. లాభ స్థానం పటిష్ఠం అయినందువల్ల ఆదాయ వృద్ధికి, అధికార యోగానికి బాగా అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశికి దశమంలో ఉన్న రాహువు శుభుడుగా మారడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగంతో పాటు ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి లేదా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను విస్తరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశిలో ఉన్న గురువుకు, భాగ్య స్థానంలో ఉన్న రాహువుకు మధ్య నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి, ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది.

సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న రాహువు గురువుతో నక్షత్ర పరివర్తనతో శుభుడైనందువల్ల ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వ్యాపారాల్లో భాగస్వాములు అనుకూలంగా మారడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల విశేషంగా లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న గురువుతో పంచమ స్థానంలో ఉన్న రాహువుకు నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల వృత్తి, ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. సామాజికంగా రాజపూజ్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.

ధనుస్సు: రాశ్యధిపతి గురువుకు రాహువుతో నక్షత్ర పరివర్తన జరిగినందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నమైనా నెరవేరుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కులాంతర లేదా మతాంతర వివాహం జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే సూచనలున్నాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్ అందుతుంది.