
హైవోల్టేజీ విద్యుత్ తీగలపై పక్షులు నిలబడితే వాటికి కరెంట్ షాక్ ఎందుకు కొట్టదో తెలుసా? నిజానికి ఎలక్ట్రాన్లు ఒక చోట నుంచి మరొక చోటికి ప్రవహించడాన్నే ఎలక్ట్రిక్ కరెంట్‌అని అంటారు. ఈ ఎలక్ట్రాన్లు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ తీగల సాయంతో ఎలక్ట్రానిక్ పరికరాలకు చేరుతాయి.

ఎలక్ట్రాన్లు ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్ వైపు ప్రయాణిస్తాయి. ఈ తీగలను మనుషులెవరైనా తాకితే షాక్ కొడుతుంది. ఐతే.. పక్షులకు ఎందుకు షాక్ కొట్టదంటే..

పక్షి విద్యుత్ వైర్‌పైన నిలబడినప్పుడు దాని రెండు కాళ్లు పాదాలకు ఈకలు ఉండవు. ఒక బొటనవేలు వెనుకకు, ఇతర మూడు పాయింట్లు ముందుకు ఉంటాయి. తీగపై వాలినప్పుడు కింద పడిపోకుండా తీగను గట్టిగా పట్టుకుంటాయి. అంతేకాకుండా.. పక్షి తన రెండు పాదాలను ఎలక్ట్రికల్ వైర్‌పై ఉంచినప్పుడు, వాటి కాళ్లకు సమానమైన విద్యుత్ సామర్థ్యం ఉంటుంది. అంటే ఒకే ఎలక్ట్రిక్ పొటెన్షియల్‌లో ఉంటాయి. అందువల్ల ఎలక్ట్రాన్లు పక్షి శరీరం నుంచి ప్రవహించవు. ఎలక్ట్రాన్లు ప్రవహించకపోతే అక్కడ కరెంట్ సప్లైకాదు. అందుకే పక్షికి షాక్ కొట్టదు.

పొరపాటున అదే సమయంలో మరో విద్యుత్ తీగను పక్షి తాకితే.. ఆ తీగ భిన్నమైన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కలిగివుంటుంది కాబట్టి, ఎలక్ట్రాన్ల ప్రసరణ జరిగి పక్షి మృతి చెందుతుంది.

మనుషులకు కూడా కరెంట్ షాక్ ఇలాగే కొడుతుంది. నేలపై నిలబడిన వ్యక్తికి షాక్ కొడితే.. ఆ వైర్‌లోని పొటెన్షియల్, కింద నేలపై పొటెన్షియల్ భిన్నంగా ఉంటుంది. దీంతో మన శరీరం లోంచి విద్యుత్ ప్రవహించి షాక్‌కు గురవ్వడం జరుగుతుంది.