
సాధారణంగా కొత్త వస్తువుల వాసన బాగుంటుంది. మరీ ముఖ్యంగా కొత్త కారులో వచ్చే స్మెల్ అందరికీ నచ్చుతుంది.

కారులో వాడే పర్‌ఫ్యూమ్‌తో పాటు కారు తయారు చేసేప్పుడు రంగుల్లో, పరికరాల తయారీలో ఉపయోగించే రసాయనాల కారణంగా ఈ వాసన వస్తుంది.

అయితే ఈ వాసన పీల్చుకోవడానికి బాగానే అనిపించినా ఆరోగ్యానికి మాత్రం చాలా ప్రమాదకరమని ఓ అధ్యయనంలో తేలింది.

కారు తయారు చేసే క్రమంలో ఉపయోగించే రసాయనాలలో వీఓసీలు లేదా ఆర్గానిక్ కాంపౌండ్ల మిశ్రం ఉంటాయని, సూర్యుని ఎండ తగలడం వల్ల కారులో ఈ పదార్థాల ప్రభావం రెట్టింపు అవుతోందని అధ్యయనంలో తేలింది.

ఫార్మాల్డిహైడ్, ఇథైల్ బెంజీన్, టొల్యూన్ లాంటి హానికారక కెమికల్స్ వాసనలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. నెయిల్ పాలిష్ రిమూవర్, కరెక్షన్ పెన్స్, పెయింట్, గ్లూ లాంటి వాసనలను ఇవి పోలి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

వీటి వల్ల అలర్జీలు, తలనొప్పులు, వాంతులు, నీరసం లాంటి సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కాలిఫోర్నియాకు చెందిన ఓ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ఎండలో కారు ఉన్నప్పుడు అందులో కూర్చొన్న వ్యక్తిపై పడే గాలి శాంపిల్స్ సేకరించి పరిశోధించిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు.