
వార్మప్ చేయకపోవడం నష్టదాయకం: జిమ్‌కు వెళ్లే చాలా మంది సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో వార్మప్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి, నేరుగా హెవీ వర్కవుట్స్ చేయడం ప్రారంభిస్తారు. ఇది చాలా పెద్ద పొరపాటు. దీనివల్ల మోకాళ్ల కండరాలపై అకస్మాత్తుగా ఒత్తిడి పడి, నొప్పులు, గాయాలు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది, కీళ్లలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కాబట్టి రన్నింగ్, స్క్వాట్స్ లేదా జంపింగ్ వంటి వ్యాయామాలు చేసే ముందు కనీసం 10 నిమిషాల పాటు ఖచ్చితంగా వార్మప్ చేయండి.

తప్పుడు పోజిషన్స్‌లో వర్కౌట్స్: వర్కవుట్ చేసేటప్పుడు బాడీ కరెక్ట్ పొజిషన్‌లో లేకపోతే అది నేరుగా మోకాళ్లపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా స్క్వాట్స్ , లంజెస్ లెగ్ ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు శరీర బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే, మోకాళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మెల్లమెల్లగా మోకాళ్ల నొప్పులు, వాపులు, లిగమెంట్ ఇంజరీ వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి.

అవసరానికి మించి వర్కవుట్: కొంతమంది త్వరగా ఫిట్‌గా మారిపోవాలనే ఆరాటంతో గంటల తరబడి జిమ్‌లోనే గడుపుతారు లేదా సామర్థ్యానికి మించి హై-ఇంటెన్సిటీ వర్కవుట్స్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల శరీరం అలసిపోయినప్పుడు కండరాలు రికవర్ అవ్వడానికి సమయం దొరకదు. దీనివల్ల మోకాళ్ల కీళ్లు బలహీనపడి, నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఎల్లప్పుడూ మీ శరీర సామర్థ్యాన్ని బట్టి మాత్రమే వర్కవుట్ చేయండి. వర్కౌట్స్ చేసేప్పుడు మధ్యలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

తప్పుడు బూట్లతో వ్యాయామం: వర్కవుట్ చేసేటప్పుడు మనం ఎలాంటి బూట్లు వేసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. చాలా మంది డెయిలీ వాడే షూ వేసుకునే రన్నింగ్ లేదా వర్కవుట్ చేస్తుంటారు. దీనివల్ల మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న స్పోర్ట్స్ షూస్ వేసుకోవడం ఉత్తమం. ఇవి పాదాలకు, మోకాళ్లకు మంచి సపోర్ట్‌ను ఇస్తాయి. ఇవి వ్యాయామం చేసేటప్పుడు మోకాళ్లపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి ఏవి పడితే ఆ షూ వేసుకొని వర్కౌట్స్ చేయకండి.

ఫిట్‌నెస్ అనేది ఒక ప్రయాణం మాత్రమే.. ఇందులో ఎంత సమయం చేస్తున్నామనే దాని కంటే ఎంత కరెక్ట్‌గా చేస్తున్నామనేది చాలా మఖ్యం. కాబట్టి ఎల్లప్పుడూ నిపుణుల సమక్షంలో లేదా సరైన అవగాహనతోనే వర్కవుట్ చేయడం మంచిది. త్వరగా బరువు తగ్గాలని ఇష్టాను సారంగా వర్కౌట్స్ చేస్తూ.. కొన్ని సార్లు అది ప్రాణాల మీదకే రావచ్చు.. జాగ్రత్త!