2022 కాలెండర్ సంవత్సరంలో టీమ్ ఇండియా తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మ్యాన్ రిషబ్ పంత్ ఈ ఏడాది 7 మ్యాచ్‌ల్లో ఆడాడు. వాటిల్లో 12 ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్ మొత్తం 680 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు కూడా ఉండడం గమనార్హం.
మరో విశేషమేమిటంటే.. పంత్ చేసిన 680 పరుగులలోనకే 21 సిక్సర్లు బాదాడు. దీంతో 2022లో టీమిండియా తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా సిక్సర్ల రికార్డులో సెహ్వాగ్ తర్వాత పంత్ రెండో స్థానంలో నిలిచాడు.
టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున ఒక ఏడాది కాలంలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. వీరూ 2008లో వరుసగా 22 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు.
ఇప్పుడు 2022లో రిషబ్ పంత్ 21 సిక్సర్లు బాదడం ద్వారా సెహ్వాగ్ తర్వాత 2వ స్థానంలో నిలిచాడు. కేవలం 1 సిక్స్‌తో సెహ్వాగ్ రికార్డును సమం చేసే అవకాశాన్ని కోల్పోయాడు పంత్.
ఇక ఈ లిస్ట్‌లో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. 2019లో టెస్ట్ క్రికెట్‌లో హిట్‌మ్యాన్ 20 సిక్సర్లు బాదాడు.