
బాబోయ్ అవి చెట్లు కాదండి.. వందేళ్లకు పైగా వయసున్న మహావృక్షాలు. ఆ మహా వృక్షాలకు కాసే మామిడి పళ్లకి భలే క్రేజ్ ఉంది.. అందులోనూ పచ్చడి మామిడి కాయకి మరింత ఆదరణ ఉంది. తోటల్లో చెట్లకు కాసే మామిడికాయలు మన మార్కెట్లో భారీగా అమ్ముడు అవుతుండగా, ప్రకృతి సహజ సిద్ధంగా అడవుల్లో మామిడి వృక్షాలకు కాసిన పచ్చడి కాయలు అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటి పచ్చళ్లు కాయలు మంచిర్యాల జిల్లా నెన్నల మండలం జోగాపూర్ అటవీ ప్రాంతంలో విరివిగా ఉన్నాయి.

అయితే ఇక్కడే ఒక కిటుకుంది. అన్ని మామిడి తోటల్లాగా ప్రతి ఏడు ఇక్కడ వృక్షాలకు మామిడి కాయలు కాయవు. ఆరేళ్లకు ఒకసారి ఈ చెట్లకు కాయలు కాస్తాయి.. ఇలా కాసిన మామిడి కాయలు పచ్చడికి ప్రత్యేకం. కాయ చిన్నగా కనిపించిన దాని గుణమే వేరు. అడవి అందించిన ఈ మామిడికాయలను కొండ మామిడి (జోగాపూర్ మత్తళ్లు) అనే పేరుతో పిలుస్తారు. ఆకాశాన్ని అంటే ఎత్తులో కాసిన ఈ మామిడి కాయలను తెంపడం అంటే సాహసంతో కూడుకున్నది.

ప్రకృతి సిద్ధమైన అడవుల్లో లభించే ఈ కొండ మామిడి కాయలను కోసేందుకు కూలీలు ఎగబడుతుంటారు. ఈ మామిడి కాయలతో చేసిన పచ్చళ్ళకు భళే గిరాకీ ఉంది. ఒక్కసారి ఈ కాయల పచ్చడి రుచి చూస్తే చాలు మళ్లీ మళ్లీ ఈ మామిడికాయల పచ్చడి కోసం జోగాపూర్ అడవుల బాట పట్టాల్సిందేనంటున్నారు ఇక్కడి స్థానికులు. నోరూరించే మామిడికి తెలంగాణలో కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి ఈ జోగాపూర్ కొండ మామిడి వృక్షాలు.

తోటల్లో కాసే మామిడికి, జోగాపూర్ అడవుల్లో లభించే కొండ మామిడి కి చాలా వ్యత్యాసం ఉందండోయ్. తోటలోని మామిడి తో పచ్చడి సంవత్సరం నిలువ ఉంటే.. ఇక కొండ మామిడి కాయల పచ్చడి రెండు మూడేళ్లయిన చెక్కు చెదరకుండా రుచిని మరిపిస్తుందని ఇక్కడివారు చెబుతున్నారు. అందుకే ఈ కాయలకు భలే డిమాండ్ ఉంది.

మంచిర్యాల జిల్లాతో పాటు కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుండి జోగాపూర్ కొండ మామిడి కాయల కోసం వస్తున్నారంటే వాటి ప్రత్యేకతను వేరే చెప్పుకోనవసరం లేదు. అందుకే అడవుల్లో అరుదుగా లభించే ఈ కొండ మామిడి కి ప్రత్యేకత ఉందంటున్నారు స్థానికులు.