
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో అత్యంత అరుదైన 'క్లార్కిఇండా ట్రాకోడెస్' అనే అడవి పుట్టగొడుగును గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య గుర్తించారు. అగారికేసి కుటుంబానికి చెందిన ఈ పుట్టగొడుగు తెలంగాణ రాష్ట్రంలో నమోదవడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు.

జీవవైవిధ్య పరిశోధనలో భాగంగా నిర్వహించిన పరిశీలనల్లో ఈ పుట్టగొడుగు కనిపించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శిలీంద్ర శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోహరాచారి సహకారంతో దీనిని 'క్లార్కిఇండా ట్రాకోడెస్'గా నిర్ధారించారు. సుమారు 15సెంటీమీటర్ల ఎత్తు, 15 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఫలనాంగంతో (గొడుగు) ఉండే ఈ పుట్టగొడుగు జింక చర్మాన్ని పోలిన గోధుమ రంగు పొలుసులతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రకృతిలో అత్యంత అరుదుగా కనిపించే ఈ జాతి ఇప్పటివరకు దేశంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే నమోదైంది. తాజాగా తెలంగాణలోనూ దీని గుర్తింపు రాష్ట్ర జీవవైవిధ్య పరిశోధనలో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈ పుట్టగొడుగు విషతుల్యమైనదని, దీనిని ఆహారంగా తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలియని అడవి పుట్టగొడుగులను సేకరించి తినడం వల్ల తీవ్రమైన విషప్రభావాలు, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని సూచించారు. అందువల్ల అడవుల్లో కనిపించే పుట్టగొడుగులను ఆహారంగా వినియోగించరాదని సూచించారు.

డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో ఇప్పటివరకు అనేక అరుదైన వృక్షాలు, శిలీంద్రాలు, కీటకాలు, చిమ్మటల జాతులు గుర్తించబడ్డాయి. దీంతో వృక్షశాస్త్రం, జీవవైవిధ్యం, పర్యావరణ శాస్త్రం చదివే విద్యార్థులకు ఈ ఉద్యానవనం ప్రత్యక్ష పరిశోధనా కేంద్రంగా, ప్రయోగాత్మక అధ్యయన వేదికగా మారింది. ఇక అరుదైన శిలీంద్ర జాతి గుర్తింపు పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో జరుగుతున్న పరిశోధనలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు రాష్ట్ర జీవవైవిధ్య సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి పరిశోధనలకు కళాశాల యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.