
అరకేజీ వంకాయలను తీసుకోవాలి. వాటిని శుభ్రం చేసి, ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి, కడిగిన వంకాయలను వేయాలి. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయలు కట్ చేసిన తర్వాత నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని, తొడిమలు ఉంచి, అడుగు వరకు కాకుండా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి. అన్ని వంకాయలను ఇలా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోండి.

ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు, శనగపప్పు, మనప్పు, ఇవన్నీంటిని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, సన్నని మంటపై వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టి, మళ్లీ స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని చల్లార బెట్టుకోవాలి.

ఇప్పుడు వేయించిన మసాలా దినుసులన్నింటినీ మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అదే జార్‌లో కొద్దిగా చింతపండు , మూడు టీ స్పూన్ల కారం వేసి, మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పొడిలో ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలుపుకోవాలి.

ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఉప్పు నీటిలో నుంచి తీసి, సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను ప్రతి వంకాయలో నింపుకోవాలి. మిగిలిన మసాలా పొడిని పక్కన పెట్టుకోండి, కూరలో వేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, కుక్కర్ పెట్టి, సరిపడ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి. తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి, రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి.

ఇప్పుడు, మసాలా నింపిన వంకాయలను కుక్కర్‌లో జాగ్రత్తగా పెట్టి, మధ్య మధ్యలో కలుపుతూ రెండు మూడు నిమిషాలు నూనెలో వేయించాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ గుత్తివంకాయ కర్రీ రెడీ. మరీ మీరు కూడా ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేయండి.