
మనం తీసుకునే పోషకాలు అండం విడుదల, ఋతుస్రావం, వీర్యకణాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. పురుషులలో జింక్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు వీర్యకణాల కదలికను, నాణ్యతను మెరుగుపరుస్తాయి. అయితే అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచి, హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది.

మీరు గర్భధారణ కోసం ప్లాన్ చేసుకుంటున్నా లేదా IVF వంటి చికిత్సలు తీసుకుంటున్నా కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం మంచిది. బ్రౌన్ రైస్, ఓట్స్, చిరుధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. బాదం, వాల్‌నట్స్, విత్తనాలు మరియు అవకాడోలు హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి.

అంతేకాకుండా పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు శరీర కణజాలాలను బలోపేతం చేస్తాయి. విటమిన్-సి పుష్కలంగా ఉండే ఆకుకూరలు, నిమ్మజాతి పండ్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. పెరుగు, పులియబెట్టిన ఆహారాలు జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వీటికి దూరంగా ఉండండి: గర్భధారణకు ప్రయత్నిస్తున్న దంపతులు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అతిగా కాఫీ తాగడం, మద్యం సేవించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ధూమపానం నేరుగా అండం, శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తుంది. బేకరీ ఐటమ్స్, వేపుళ్లు హార్మోన్ల వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి.

IVF లేదా ఇతర సంతానోత్పత్తి చికిత్సలు పొందుతున్న వారు ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్-డి సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి గర్భధారణ ప్రారంభ దశలో పిండం ఎదుగుదలకు ఎంతో అవసరం. సరైన ఆహార నియమాలతో పాటు వైద్యుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన గర్భధారణ సాధ్యమవుతుంది.