
అంజీర్ పండ్లను అతిగా తినడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంజీర్ పండ్లలో కాల్షియం, పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కానీ, అలెర్జీ సమస్యలు ఉన్నవారికి అంజీర్ పండ్లను తినడం హానికరం. అలెర్జీలు ఉన్నవారు అంజీర్ పండ్లను తినేటప్పుడు దురద, దద్దుర్లు పెరగవచ్చు.

అంజీర్ పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే డయాబెటిక్ రోగులు అంజీర్ పండ్ల వంటి తీపి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే తక్కువ మోతాదులో తినాలని చెబుతున్నారు.

అంజీర్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇది హానికరం కావచ్చు. ఇప్పటికే గ్యాస్ సమస్య, ఉబ్బరం లేదా మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తులు అంజీర్ పండ్లను తీసుకోకపోవడమే మంచిది. లేదంటే అపానవాయువు, వాపు సంభవించవచ్చు. అంతేకాకుండా మలబద్ధక సమస్య మరింత తీవ్రం కావచ్చు అంటున్నారు.

కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు అంజీర్ పండ్లను తినకూడదు. లేకపోతే, అది కాలేయ ఒత్తిడిని పెంచుతుంది. అందుకే కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగులు పొరపాటున కూడా అంజీర్ పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే అవి కాలేయ పనితీరును నెమ్మదిస్తాయి. దీంతో అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు అంజీర్ పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో.. మీరు బరువు తగ్గకపోగా.. పెరిగే ప్రమాదముంది. అందుకే వెయిట్ లాస్ జర్నీలో అంజీర్ పండ్లను దూరంగా పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.