
పైన సాఫ్ట్ బియ్యప్పిండి లేయర్, లోపల గణపతికి ఇష్టమైన నువ్వులు, గసగసాలు, బాదం పలుకులు, పుట్నాల పిండి మరియు తాజా పచ్చి కొబ్బరి-బెల్లం పూర్ణంతో నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉండే ఈ మోదకాల తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

కావలసిన పదార్థాలు: 1 కప్పు పొడి బియ్యపు పిండి, 1 కప్పు నీళ్లు, 1 టీస్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 కప్పు తాజా పచ్చి కొబ్బరి తురుము, ముప్పావు కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు పుట్నాల పప్పు, 4-5 యాలకులు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టీస్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన బాదం పలుకులు

తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక కప్పు నీళ్లు, ఒక టీస్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసి వేడిచేయాలి. ఇక్కడ బెల్లానికి బదులు పంచదార వాడితే మోదకం తెల్లగా అందంగా వస్తుంది. నీళ్లు వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేసి, ఒక కప్పు బియ్యప్పిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. మూతపెట్టి పిండిని చల్లారనివ్వాలి.

స్టఫింగ్ తయారీ: మిక్సీ జార్‌లో పావు కప్పు పుట్నాల పప్పు, యాలకులు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మీడియం మంటపై దోరగా వేయించాలి. అందులోనే నెయ్యి వేసి, గ్రైండ్ చేసిన కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ముప్పావు కప్పు బెల్లం తురుము, రెండు చెంచాల నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉడికించాలి.

బెల్లం కరిగాక పుట్నాల పొడి, బాదం పలుకులు వేసి బాగా కలిపి గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్న బియ్యప్పిండిని చేతికి నీటి తడి చేసుకుంటూ మెత్తగా ముద్దలా ఒత్తుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు పిండిని తీసుకుని కప్ షేప్ లో పలుచగా చేసుకోవాలి. లోపల ఒక టేబుల్ స్పూన్ స్టఫింగ్ ఉంచి అంచులను పైకి ముడుస్తూ మోదకం ఆకారం తేవాలి.

చెంచా వెనుక భాగంతో గాట్లు పెడితే మోల్డ్ లేకుండానే అద్భుతమైన డిజైన్ వస్తుంది. స్టీమింగ్ ప్లేట్‌కు నెయ్యి రాసి మోదకాలను ఉంచి, పైన కొద్దిగా కుంకుమపువ్వు రేకులు అలంకరించాలి. మరిగే నీటిపై మూతపెట్టి మీడియం మంటపై 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికిస్తే మృదువైన కమ్మని మోదకాలు సిద్ధం!