
మంచిర్యాల జిల్లా మందమర్రికి కి చెందిన ఈస్త సృజన (34) కు కొమురంభీం జిల్లా జన్కాపూర్ కు చెందిన గుండు నాగరాజుకు 2018 లో వివాహం అయింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. వృత్తిరిత్యా మూడేళ్లుగా దుబాయ్ లో ఉంటున్నారు. రెండు నెలల క్రితం ప్రసవం కోసం తల్లిగారింటికి మందమర్రికి వచ్చింది. 23 రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సృజన. భర్త సైతం 11 రోజుల క్రితం ఇండియాకు వచ్చి కొడుకును భార్యను చూసి తిరిగి ఉద్యోగానికి దుబాయ్ కు వెళ్లిపోయాడు.

ఇంతలోనే సృజన తీవ్రంగా తలనొప్పి వస్తుందంటూ తల్లిగారింట్లో ఒక్కసారి గా కుప్పకూలింది. అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరబాద్ కు తరలించారు. కానీ అంతలోనే విషాదం చోటుచేసుకుంది. సృజన బ్రెయిన్ డెడ్ కు గురైందంటూ తెలిపారు వైద్యులు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీయ్యారు.

తనువు చాలించి.. నలుగురికి ప్రాణం పోసి.. హైదరబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన సృజన.. బ్రెయిన్ డెడ్ కు గురైందని తెలిపారు అక్కడి వైద్యులు. ఏం చేసినా లాభం లేదని.. అవయవదానం చేసి మరో నలుగురికి ప్రాణదానం చేసే అవకాశం ఉందని కుటుంబ సభ్యులను ఒప్పించారు వైద్యులు. జీవన్ ధాన్ సంస్థ ప్రతినిధులు కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి అవగాహన కల్పించారు.

విషయం తెలుసుకున్న భర్త నాగరాజు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని, భార్య అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. దీంతో సదరు ఆసుపత్రి వైద్యులు సృజన రెండు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన రోగులకు మార్పిడి చేశారు. ఆమె అవయవ దానంతో నలుగురి ప్రాణాలు నిలిచాయి. అవయవదానం అనంతరం సృజన పార్థివదేహానికి ఆ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ సెల్యూట్ చేసి నివాళులర్పించడం అందరి హృదయాలను కదిలించింది.

కన్నీరు మున్నీరైన జన్కాపూర్.. గురువారం సాయంత్రం జనకాపూర్ గ్రామంలో సృజన అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి చితికి ఐదేళ్ల పెద్ద కుమారుడుతో అంత్యక్రియలు నిర్వహింపజేశారు గ్రామ పెద్దలు. తల్లి పొత్తిల్లలో సేదతీరాల్సిన 23 రోజుల పసికందు తల్లి చితి ముందు గుక్కపెట్టి ఏడ్వడం అందరిని కలిచి వేసింది. విషాదాన్ని తట్టుకుని సమాజహితాన్ని ముందుంచి అవయవదానానికి ముందుకొచ్చిన సృజన కుటుంబ సభ్యులను జీవన్ ధాన్ ప్రతినిధులతో పాటు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, సభ్యులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేష్, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కేఎస్ వాసు, రాంరెడ్డి తదితరులు అభినందించారు.