
మామిడి పండ్లలో విటమిన్ A, B, C, E, K, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పాలిఫెనాల్స్, ట్రైటెర్పెనెస్, లుపియోల్స్ వంటి సమ్మేళనాలు శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంతో సహాయపడుతాయి. కానీ ఇవి అందరిపై ఒకేలా లాంటి ప్రభావాన్ని చూపలేవు. ఈ క్రింద పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వీటిని తినే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.

జీర్ణ సమస్యలు: అమితమైన రుచి ఉన్నప్పటికీ, మామిడి పండ్లను పరిమితంగానే తీసుకోవాలి. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు వీటిని ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు లేదా కడుపు నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

మధుమేహం: డయాబెటీస్ ఉన్న వ్యక్తులు కూడా మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలి. మామిడి పండ్లలో సహజ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

బరువు పెరగడం: మీరు వెయిట్ లాస్ కోసం చూస్తుంటే మామిడి పండ్ల జోలికి వెళ్లకండి. ఎందుకంటే మామిడి పండులో సుమారు 150 క్యాలరీలు ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగడానికి దొహదపడుతాయి. బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లను అతిగా తినడం వల్ల వారి ప్రయత్నాలకు ఆటంకం కలగవచ్చు. అలాగే మామిడి పండ్ల అంటే అలర్జీ ఉన్న వారు కూడా వీటికి దూరంగా ఉండండి.

చర్మ సమస్యలు: చర్మ సమస్యలు ఉన్న వారు కూడా మ్యాంగోస్‌కు దూరంగా ఉండాలి. మామిడి పండ్లు శరీరంలో వేడిని పెంచుతాయి. వీటిని అతిగా తింటే మొటిమలు పెరిగే ప్రమాదం ఉంది. మార్కెట్లో లభించే పండ్లను త్వరగా పండడానికి వాటిపై హానికరమైన రసాయనాలను వాడుతుంటారు. ఇవి శరీరానికి చాలా హాని కలిగిస్తాయి.

కాబట్టి పండ్లను తినడానికి ముందు కనీసం గంట సేపు నీటిలో నానబెట్టి, బాగా కడిగి తినాలి.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడినవి..వీటిని TV9 దృవీకరించడం లేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)