
తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. క్లినికల్ సైన్సెస్ విభాగంలో చిరుత ప్రత్యక్షం అయింది. నిన్న ఉదయం 8:57 గంటల సమయంలో వర్సిటీ లోని క్లినికల్ సైన్సెస్ బ్లాక్‌లో ఉన్న చిరుత సిబ్బంది కంటపడింది. డిపార్ట్మెంట్ తలుపులు తీయగానే అటెండర్ కు చిరుత కల్పించింది. దీంతో భయంతో వణికి పోయిన మహిళ అటెండర్ తలుపులు తీయగానే కనిపించిన చిరుతను చూసి భయంతో తలుపులు మూసి పరుగులు పెట్టింది.

ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. భవనం వెనుక ఉన్న చెట్టు ఎక్కి చిరుత చొరబడి ఉంటుందని భావించిన వర్సిటీ సిబ్బంది కర్రల సాయంతో చిరుతను బెదరగొట్టే ప్రయత్నం చేశారు. భవనం లో తిష్ట వేసిన చిరుతను తరిమేందుకు ప్రయత్నించడంతో చిరుత భయంతో టాయిలెట్ లోకి వెళ్లి దాక్కుంది.

ఏడాది వయసున్న ఆడ చిరుత వర్సిటీ లోకి వచ్చిన సమాచారాన్ని అందుకున్న అటవీశాఖ ఘటన స్థలానికి చేరుకుంది. ఉదయం 9:51 గంటల సమయంలో ఫోటో ఆధారంగా చిరుతపులి ఉనికి ని నిర్ధారించిన హనుమాన్ టీమ్ చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ప్రయత్నించింది.

ట్రాన్స్‌పోర్ట్ కేజ్‌ను ఏర్పాటు చేసి 11:25 గంటలకు చిరుతను బంధించిన రెస్క్యూ టీమ్.. 11:29 గంటలకు తిరుపతి జూ పార్కు తరలించారు. జూ పార్క్‌లోని యానిమల్ రెస్క్యూ సెంటర్ కు సేఫ్ గా తరలించిన హనుమాన్ టీమ్ చిరుత కు వైద్య పరీక్షలు చేయించింది.

ఏడాది వయసు ఉన్న ఆడ చిరుత ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉంది. గత కొద్ది రోజులుగా వర్సిటీ ప్రాంతంలో చిరుతల సంచారం భయాందోళనకు గురిచేస్తుండగా ఇప్పుడు ఏకంగా భవనాల్లోకి చొరబడుతుండడం వర్సిటీ విద్యార్థులు, సిబ్బందిలో మరింత భయం కలిగిస్తుంది.