
ఆరోగ్యకరమైన జీవితానికి ఉదయం పూట బ్రేక్ పాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదయం అల్పాహారంగా ఏమి తీసుకుంటామనే దానిపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఉదయం పూట సమయం లేదని తొందరలో అల్పాహారం తీసుకోకుండానే బయటకు వెళ్లిపోతుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ దాటవేసే అలవాటు క్రమంగా జీవక్రియ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. దీనిలో బొడ్డు కొవ్వు, అధిక రక్తపోటు, అధిక చక్కెర, చెడు కొలెస్ట్రాల్ ఒకేసారి పెరుగుతాయి.

ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఉదయం టిఫిన్ స్కిప్ చేసే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్ తీసుకోవడం మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్లు తిరగడం, బలహీనత వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

ఉదయం టిఫిన్ తీసుకోవడం మానేస్తే జీవక్రియ మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు ఇది దారి తీస్తుంది. శరీర మెటబాలిజం తగ్గడం వల్ల జీవక్రియ రేటు తగ్గుతుందని అంటున్నారు.

మైగ్రేన్ వంటి సమస్యలకు కూడా టిఫిన్ స్కిప్ చేయడం ఒక కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువసేపు ఆకలితో ఉండడం తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.