
కావలసిన పదార్థాలు: పావు కప్పు ఉలవలు , నిమ్మకాయ సైజు చింతపండు, సుమారు 1 లీటరు నీళ్లు రసం తీయడానికి మరియు కట్టుచారుకు, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 2 నుండి 3 చీల్చిన పచ్చిమిరపకాయలు, 1 టీస్పూన్ బెల్లం పొడి పులుపును బ్యాలెన్స్ చేయడానికి, కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు.

రసం మసాలా పేస్ట్ కోసం: 2 టీస్పూన్ల ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మెంతులు, 3-4 ఎండుమిర్చి, 3 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కలు, 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క. పోపు కోసం: 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టీస్పూన్ మినప్పప్పు, 1 టీస్పూన్ ఆవాలు, 1 తుంచిన ఎండుమిర్చి, 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, పావు టీస్పూన్ ఇంగువ.

తయారీ విధానం: బాండీలో పావు కప్పు ఉలవలు వేసి మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి దోరగా వేయించాలి. రంగు మారిపోకుండా, కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఉలవలను మిక్సీ జార్‌లో వేసి వీలైనంత మెత్తటి ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

నిమ్మకాయ సైజు చింతపండును ఒక లీటరు నీటిలో నానబెట్టి చిక్కటి చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవ పొడిని మరియు రుచికి సరిపడా ఉప్పును వేసి ఉండలు ఏమీ లేకుండా విస్కర్ లేదా గరిటెతో బాగా కలపాలి.మిక్సీ జార్‌లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు వేసి ముందుగా పొడి చేయాలి. ఆ తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసి కాస్త నీళ్లు చిలకరించి మెత్తటి రసం మసాలా పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి.

కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి.. మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు దోరగా వేగే వరకు వేయించాలి, . తర్వాత పావు టీస్పూన్ ఇంగువ, సిద్ధం చేసుకున్న రసం మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు పసుపు వేసి, కలిపి ఉంచుకున్న ఉలవ పిండి చింతపండు రసాన్ని పోయాలి.

చీల్చిన పచ్చిమిర్చి, సరిపడా నీళ్లు కలిపి సన్నటి సెగపై 15 నుండి 20 నిమిషాల పాటు మరిగించాలి. మరిగే సమయంలో ఒక టీస్పూన్ బెల్లం వేయాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించుకోవాలి. అంతే, నోరూరించే పాతకాలపు 'ఉలవ కట్టుచారు' సిద్ధం! ఇది వేడి మీద కంటే కాస్త చల్లారిన తర్వాత మరింత చిక్కబడి అమృతంలా మారుతుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ కట్టుచారు కలుపుకుని తింటే శరీరానికి ఎంతో తేలికగా, హాయిగా ఉంటుంది!